Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
భూఆక్రమణాలు తమ దృష్టికి రావడం లేదని తహసీల్దార్ చెప్పడం దారుణమని కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి అన్నారు. ఆక్రమణకు గురైన స్థలాలను వారు బుధవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సోమయ్య, జయరాంరెడ్డి మాట్లాడారు. తహసీల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని విలువైన భూములను కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు తెలిపారు. మండల కేంద్రంలోని విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురౌతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మండలానికి చెందిన పలువురు పేదలు ఇంటి స్థలాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు కబ్జాలను పట్టించుకోవడం లేదన్నారు. పత్రికల్లో వార్తలొచ్చినా తహసీల్దార్, రెవిన్యూ అధికారులు స్పందించక పోవడం దారుణమైన విషయమన్నారు. ఇప్పటికైనా ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణాలకు పాల్పడ్డ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పేదలతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు చాద మల్లయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు హిదాయతుల్లా, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు మహబూబ్ ఖాన్, గౌస్, సీనియర్ నాయకులు తోట అశోక్, సీతక్క యువసేన అధ్యక్షుడు సిద్ధాబత్తుల జగదీష్ పాల్గొన్నారు.