Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వతెలందగాణ-కేసముద్రం రూరల్
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సీపీఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో సీపీఐ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను మోస్తూ వినూత్న నిరసన ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పరి శేఖర్, మంద భాస్కర్ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేస్తామని చెప్పిన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. కార్పోరేట్ పెట్టుబడిదారులకు కోట్లరూపాయలు రాయితీలిస్తూ పేదప్రజలపై మాత్రం పెను భారం మోపుతుందన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు అదుపులో ఉంచిన పెట్రోల్ ,డీజిల్ ధరలను ఎన్నికల అనంతరం రోజురోజుకు పెంచుతూ వినియోగదారుల జేబుకు చిల్లు పెడుతున్నారు. సామాన్య ప్రజల బతుకులు ఛిద్రమవుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెరిగిన ధరలను అదుపు చేయాలని, లేనిపక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులుసామ సారయ్య, కాసు సాయిచరణ్, బాలా చారి,రవి,రమేష్, వెంకన్న, అమీర్ ,ఉప్పలయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.