Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజెన్సీ గ్రామాన్ని సందర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని మట్టెవాడ గ్రామపంచాయతీ అత్యంత మారుమూల ప్రాంతమైన కనీసం రోడ్డు మార్గం లేని ఏజెన్సీ దొరవారు తిమ్మాపురం గ్రామాన్ని గురువారం తహశీల్దార్జంగా శైలజ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఎంపీవో ప్రసాదరావు, జెడ్పీ కోఆప్షన్ నెంబర్ ఎండి కాసీం, సర్పంచ్ ఈసం సంధ్య సూర్యనారాయణ సందర్శించారు. బుధవారం గూడూరు మండల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ మండల పరిషత్ కార్యాలయంలో సాయంకాలం దొరవారు తిమ్మాపురం ఏజెన్సీ గ్రామం పై ఆరా తీశారు అంతేకాకుండా అధికారులను సైతం అక్కడికి వెళ్లి స్థితిగతులపై నివేదిక అందజేయాలని సూచించారు. దీంతో గురువారం ఉదయం అధికార యంత్రాంగం హుటాహుటిన గురువారం ఉదయం దొరవారి తిమ్మాపురం బాటపట్టారు అక్కడికి వెళ్ళిన అధికారులు గిరిజన ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వర్షాకాలం ఇబ్బందులకు గురవుతున్నామని, వాగులు వంకలు దాటి పోవాల్సిన పరిస్థితి ఉందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు సమస్యలన్నిటిని నివేదికలో పొందుపరిచారు. మారుమూల ఏజెన్సీ గ్రామం కావడంతో రాకపోకలకు సమస్యలు తొలగాలంటే కార్లరాయి గ్రామం నుండి తిమ్మాపూర్‌కు రోడ్డు సౌకర్యం కల్పిస్తూ వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని జెడ్పీ కోఆప్షన్ నెంబర్ కాసిం, సర్పంచ్ ఈసం సంధ్యా సూర్యనారాయణ అధికార బందానికి తెలిపారు. నివేదికలను కలెక్టరుకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.
కాలినడకన వాగులు వంకలు దాటుతూ....
చుట్టూ అరణ్యం, గ్రామ సమీపాన గుట్టలు వాగులు..ఆ గ్రామానికి వెళ్లాలంటే కాలినడకే దిక్కు.. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన మండల అధికారులు అధికారులకు కాలినడకన వాగులు వంకలు దాటుతూ.. ఇబ్బందులు పడుతూ దొరవారు తిమ్మాపూర్ చేరుకున్నారు. కొత్తగూడెం మండలం కార్లయి గ్రామ శివారు వరకు వాహనాల పై వెళ్ళిన అధికారులు అక్కడ వాహనాలు నిలిపి సుమారు నాలుగు కిలోమీటర్లు కాలినడకన అడవి మార్గంలో వెళ్లారు. వాగులు వంకలు దాటుతూ వెళ్ళి రెండు కిలోమీటర్ల ట్రాక్టర్ సహకారంతో గ్రామానికి చేరుకున్నారు.