Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలు సంస్థలు కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్మికులకు జీవో నెంబర్ 60, 64 ప్రకారం వేతనాల పెంపు వివిధ కేటగిరీల ప్రకారం అమలు చేస్తున్న క్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచడంలో శీతకన్ను వేస్తుందని సీఐటీయూ మండల కన్వీనర్ వల్లాల వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సీఐటీయూ మండల అధ్యక్షులు యాదగిరి అధ్యక్షతన జగ్గుతండ గ్రామపంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో వేతనాలు పెంచాలంటూ, పెంచిన 30 శాతం పీఆర్సీ అమలు చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 60 ను విడుదల చేస్తూ వివిధ కేటగిరీలుగా నిర్ణయించి ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలను సిఫార్సు చేస్తూ జారీ చేయడం జరిగిందని, అందులో భాగంగా గ్రామపంచాయతీ కార్మికులను విస్మరిస్తూ ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పనిచేస్తున్న వారిని పట్టించుకోవడంలేదని, గత 16 నెలలుగా కరోనా విపత్తులో తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి గత రెండు సంవత్సరాల క్రితం వరకు వారి వేతనం రూ. 8500 పెంచారని అన్నారు. ఆ తరువాత 2020 ఏప్రిల్, మేలలో ఇన్సెంటివ్స్ లు ఇచ్చి నిలుపుదల చేశారని, పెరిగిన వైద్య ఖర్చులు ఇతర ధరలను దష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కావేటి వెంకన్న, ఎం. శ్రీను, పార్వతి, స్వామి, వీరన్న, హేమలత తదితరులు పాల్గొన్నారు.
19వేల బేసిక్‌పై 30శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
తొర్రూరు : రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలో 19వేల కనీస వేతనంపై 30 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలని డిమాండ్‌తో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం తొర్రూర్ మున్సిపాలిటీ ముందు నిరసన తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబులకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి రాష్ట్ర నాయకులు కొత్తపల్లి రవి మాట్లాడుతూ తెలంగాణాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల కంటే తక్కువ వేతనాలు ఇవ్వడం సరికాదన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కార్మికులు కోరుతున్న డిమాండును రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడం కోర్టు తీర్పు ఉల్లంఘనే అవుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచుతూ జీవో నెంబర్ 60 సవరించాలని, లేదంటే తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హోచ్చరించారు. వినతిపత్రం స్వీకరించిన చైర్మన్, కమిషనర్లు ప్రభుత్వ ఆదేశాలనుసారం వేతనాలు పెంచుతామని కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, వెంకన్న, శేఖర్, మహేందర్, అనిల్, నరసింహ, దేవా, కుమార్, వెంకన్న పాల్గొన్నారు.