Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కమలాపూర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వెన్నుపోటు పొడ వాలని మాజీ మంత్రి ఈటల చూశారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. గురువారం నేరెళ్ల, లక్ష్మీపూర్, పంగిడిపల్లి, మర్రిపల్లిగూడెం, మర్రిపల్లి గ్రామాల్లో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ బాబు మాట్లాడుతూ ఆరు సార్లు గెలిచిన ఈటల నియోజకవర్గాన్ని ఎక్కడ అభివద్ధి చేయలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని బడా సంస్థలకు అమ్మి వేస్తుంటే ఈటల బీజేపీలో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. ఈటల కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరారని మండిపడ్డారు. ఈటల రాజేందర్ దేనికోసం బీజేపీలో చేరారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాలపై ఇప్పటి వరకు మొండి వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. రైతుబంధు పథకాన్ని వ్యతిరేకించిన ఈటల ఎందుకు రూ.26లక్షలు రైతుబంధు డబ్బులు తీసుకున్నారని ప్రశ్నించారు. బీజేపీకి మత రాజకీయాలు తప్ప,ప్రజా సంక్షేమం పట్టదని ఆరోపించారు. కేంద్రంలో పరిపాలన లోపం వల్లే గ్యాస్, చమురు, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.100116/-అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అని అన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసి అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చెర్మెన్ సంపత్‌రావు, వైస్ చెర్మెన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పింగళి ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.