Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీటీసీల ఫోరమ్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-గూడూరు
రాష్ట్రంలోని ఎంపీటీసీలకు విధులు కేటాయించాలని, నిధులు ఇవ్వాలని కోరితే ఆ విషయాలను గాలికొదిలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎంపీటీసీలకు కరోనా కిట్ల పంపిణీలో మద్యం బాటిల్ పంపించి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరించారని ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ వాసుదేవరెడ్డి మండిపడ్డారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆత్మగౌరవం దక్కుతుందనుకుంటే ఆత్మ వంచనకు గురి కావాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కరోనా నేపథ్యంలో ఎంతో ఇబ్బందులకు గురైన ప్రజలకు క్షేత్రస్థాయిలో సేవలు అందించలేని పరిస్థితి ఉందని చెప్పారు. ఎంపీటీసీగా గెలిచి రెండేండ్లు కావస్తున్నా ఎంపీటీసీలకు గౌరవ స్థానం దక్కకపోవడం బాధాకరమన్నారు. ఎంపీటీసీలకు మెడికల్ కిట్లు పంపిణీ చేయాలనే ఆలోచన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి రావడం హర్షణీయమని చెప్పారు. సదరు కిట్లలో మాస్కులు, శానిటైజర్, డ్రైఫూట్స్తోపాటు మద్యం బాటిల్ ఉండడం అసహనానికి గురి చేసిందన్నారు. ఎంపీటీసీల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ కవితతో కలిసి పలు డిమాండ్లు వివరించగా ఇటీవల ప్రభుత్వం కొన్ని నిధులు, విధులు కేటాయిస్తుందని భావించగా మద్యం పంపి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎంపీటీసీలందరికీ నిధులు, విధులు కేటాయించాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా పర్యటనకు రానున్న సీఎంకు నిరసన తెలుపుతామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీటీసీ కత్తి స్వామి, ఉప సర్పంచ్ సంపత్, తదితరులు పాల్గొన్నారు.