Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఓ కుమార్ యాదవ్
నవతెలంగాణ-తొర్రూరు
పంట పండే భూమికి సేంద్రియ ఎరువు బలాన్నిస్తుంది. రసాయన ఎరువులపై పెట్టే పెట్టుబడి ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులు అందించేందుకు దోహదపడుతుంది. భూమికి లాభం చేసే సేంద్రియ ఎరువులను తగ్గించి అవసరం లేని రసాయన ఎరువులు వాడడం రైతులకు పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో మొక్కలు జంతువుల అవశేషాల నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువును వివిధ రూపాల్లో పంటలకు అందించాల్సిన అవసరం ఉందని మండల వ్యవసాయ శాఖ అధికారి కుమార్ యాదవ్ తెలిపారు. సేంద్రియ ఎరువుల ఆవశ్యకతపై రైతులకు ఆయన పలు సలహాలు, సూచనలు అందించారు.
పశువుల పేడ
రోజువారీగా పశువులు విసర్జించే ఎరువును జాగ్రత్తగా గొయ్యిలో భద్రపర్చితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. పశువుల కొట్టం దగ్గర 20-25 అడుగుల పొడవు, 5-6 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేలా గొయ్యి తవ్వాలి. పశువుల పేడ, మూత్రంతో తడిచిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డిని గొయ్యిలో వేయాలి. దానిపై కొద్దిగా నీటిని చల్లి మట్టి లేదా పేడ బురదతో కప్పాలి. ఇలా చేస్తే 3-4 నెలలకు బాగా చివికిపోతుంది. పొలానికి వాడే సమయానికి మంచి సేంద్రియ ఎరువుగా మారుతుంది. సాధారణంగా రైతులు ఇంటి వద్ద పశువుల పేడను కుప్పగా పోస్తుంటారు. ఇది ఎండకు ఎండి వానకు తడిచి పోషక విలువలు తగ్గిపోతాయి. ఒక లారీ పశువుల ఎరువు ధర కనీసం రూ.15-20 వేల వరకు ఉంటుంది.
కంపోస్టు ఎరువు
గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే చెత్తాచెదారం, రాలిన ఆకులు, కలుపు మొక్కలు, కుళ్లిన కూరగాయలు, వరి ఊక, చెరుకు పిప్పి, వేరుశెనగ పోర్టు పశువుల మూత్రంతో కలిసిన పేడను కంపోస్టు ఎరువుగా తయారు చేయొచ్చు. నీరు నిలవని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని మీటరు లోతు, రెండు మీటర్ల వెడల్పుతో అవసరమైనంత మేరకు పొడవు గొయ్యి తియ్యాలి. అందులో వ్యర్థ పదార్థాలు వేస్తుండాలి. మధ్య మధ్యలో పశువుల పేడ కలిపిన నీటిని చల్లుతూ 8-10 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాలి. అది మురిగి 3, 4 నెలల్లో కంపోస్టు ఎరువుగా తయారౌతుంది. ఈ ఎరువును పంటలకు వేస్తే అద్భుతంగా పని చేస్తుంది.
కోళ్ల ఎరువు
షెడ్లలో కోళ్ల కింద వేసిన పొట్టు, మలమూత్రాలతో కలిపితే నాణ్యమైన సేంద్రియ ఎరువు తయారౌతుంది. 40 కోళ్ల నుంచి ఒక ఏడాదిలో టన్ను ఎరువు వస్తుంది. ఏడాది తర్వాత తీసిన ఎరువులో దాదాపు 3 శాతం నత్రజని, 2 శాతం భాస్వరం, రెండు శాతం పోటాష్ ఉంటాయి. తేమ తగ్గే కొద్దీ పోషక శాతం పెరుగుతుంది. షెడ్లో నుంచి తీసిన తర్వాత తణుకు 5-10 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి కొద్ది రోజులపాటు గొయ్యిలో వేయాలి. బాగా చివికిన తర్వాత వాడుకుంటే లాభం ఎక్కువగా ఉంటుంది. నీటి వసతి ఉన్న భూముల్లో కోళ్ల ఎరువుతో ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. సాధారణ పంటలకు ఎకరాకు 2 టన్నుల చెరుకు వంటి పంటలకు 3 టన్నులు వేయొచు. లారీ కోడి ఎరువు ధర ప్రస్తుతం రూ.26-28 వేల వరకు ఉంటుంది.
గొర్రెల, మేకల ఎరువు
గొర్రెల, మేకల దొడ్లలో వచ్చిన ఎరువును పశువుల ఎరువులా భద్రపర్చి పొలానికి వాడుకోవచ్చు. సాధారణంగా జీవాలతో ఎండాకాలంలో ఖాళీ భూముల్లో మంద పట్టిస్తుంటారు. వీటి మలమూత్రాలు నేరుగా పొలంలోనే పడి ఉపయోగపడతాయి. మంద కట్టడం పూర్తి కాగానే పొలాన్ని ఒకసారి దున్నితే ఎరువు నేలలో కలిసిపోయి పోషకాలు వథా కాకుండా ఉపయోగపడతాయి.
ఉపయోగాలు
సేంద్రియ పదార్థం భూమి భౌతిక లక్షణాలను మెరుగుపర్చుతుంది. బరువు నెలలు గుల్ల బారి వేర్లు చక్కగా పెరగడానికి సహాయపడుతోంది. నీరు ఇంకడం పెరిగి మురుగు సౌకర్యం మెరుగౌతుంది. ఇసుక నేలలో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధం చేస్తుంది. నీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం పట్టి పెట్టుకుని శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. భూమిలోని పోషకాలను మొక్కలు గ్రహించడానికి తోడ్పడే సూక్ష్మజీవులకు సేంద్రియ పదార్థం ఆహారంగా ఉపయోగపడుతోంది. అన్ని రకాల పోషకాలు మొక్కకు అందేలా చేస్తుంది.