Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్
నవతెలంగాణ-కొత్తగూడ
అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహాన్ని మానుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ (ఏఎస్పీ) జిల్లా అధ్యక్షుడు సిద్దబోయిన భాస్కర్ కోరారు. మండలంలోని గుంజేడు గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్యాలగడ్డలో అటవీ శాఖ అధికారులు రైతులు సాగు చేసుకున్న భూముల చుట్టూ జేసీబీతో కందకాలు తీసి భూములను స్వాధీనం చేసుకున్నారనే సమాచారం తెలియడంతో ఆ ప్రదేశాన్ని ఆదివాసీ సంఘాలు ఆదివారం సందర్శించి పరిశీలించాయి. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడారు. ఏజెన్సీ పరిధిలోని కొత్తగూడ, గంగారం మండలాల్లో 2005కు ముందు నుంచే భూముల్లో సాగు చేసుకుంటూ రైతులు కుటుంబాలను పోషించు కుంటున్నారని చెప్పారు. అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహంతో ఆదివాసీ గిరిజన రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే దౌర్జన్యంగా సాగు చేసుకునే భూములను లాక్కోవడం సరికాదన్నారు. పలుమార్లు సదరు భూముల చుట్టూ కందకాలు తీసేందుకు వచ్చిన అధికారులకు హైకోర్టు ఉత్తర్వులను చూపెట్టామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి పీసా తీర్మానాలను నిర్లక్ష్యం చేయడం దుర్మార్గ మన్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో భవిష్యత్లో దశలవారీగా ఆందోళనలు కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కల్తీ వీరస్వామి, మల్లెల రాము, మోకాళ్ల సుధీర్, నరేందర్, సారమ్మ, లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.