Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి చొరవతో స్పెషల్ జోన్
- ఉపాధి లభిస్తుందని డివిజన్ ప్రజల ఆశ
- మడిపల్లి శివారులో ప్రభుత్వ స్థలం గుర్తింపు
- టీఎస్ఐసీసీకి 80 ఎకరాలు అప్పగింత
- మంత్రి దయాకర్‌రావు చొరవతోనే సాధ్యం
- ఉపసర్పంచ్ రామలింగం
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
డివిజన్ కేంద్రంలోని తొర్రూర్ మండలంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కోసం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో మడిపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 521లో సుమారు వంద ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అధికారులు 80 ఎకరాలకు సంబంధించిన పత్రాలను ఖమ్మం టీఎస్ఐసీసీకి అప్పగించినట్టు జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారికంగా ప్రకటించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుతో ఈ ప్రాంత రైతులకు, మహిళా సంఘాలకు ప్రయోజనం చేకూరనుండడంతో పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. పంట ఉత్పత్తులు ప్రాసెసింగ్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాసెస్ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసే అవకాశం లభిస్తుంది. జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి మడిపల్లి శివారులోని ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి అధికారులకు అప్పగించారు. మంత్రి దయాకర్‌రావు ఆదేశాల మేరకు జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు రామసహాయం కిషోర్‌రెడ్డి, ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, సర్పంచ్ వేల్పుల అంజలి ఐలయ్య, ఉపసర్పంచ్ రామలింగం, తదితరుల సమక్షంలో భూమిని ఖమ్మం టీఎస్ఐసీసీకి అప్పగించినట్లు తెలిపారు. సహకరించిన రైతుల లక్ష్మీకాంత్, మాచర్ల రమేష్‌లకు ప్రజాప్రతినిధులు కతజ్ఞతలు తెలిపారు.
డివిజన్ ప్రజలకు ఉపాధి అవకాశం : రామలింగం, ఉపసర్పంచ్
డివిజన్ కేంద్రంలోని మడిపల్లి గ్రామ శివారులో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ రావడంతో డివిజన్ ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ రావడానికి కృషి చేసిన మంత్రి దయాకర్‌రావు, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు రామసహాయం కిషోర్‌రెడ్డికి డివిజన్ ప్రజలు రుణపడి ఉంటారు. డివిజన్ కేంద్రానికి స్పెషల్ జోన్ వస్తే స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతోపాటు ఇక్కడ పండించిన పంటలు త్వరగా ఫుడ్ ప్రాసెసింగ్ అవుతాయని చెప్పారు. ఈ విషయంలో చొరవ చూపిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.