Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడా వ్యాపారుల కోసమే ప్రజలపై భారాలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-జఫర్ఘడ్
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ(ఎం) జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ బడా వ్యాపారుల కొమ్ము కాస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని ఆయన విమర్శించారు. మండల కేంద్రంలోని గుండెబోయిన రాజు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన పార్టీ రాజకీయ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పార్టీ నిర్మాణంపై బోధించారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాల ఫలితంగా వ్యవసాయ రంగం మరింత ధ్వంసమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆహార భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, ఆహార భద్రత చట్టాన్ని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కరోనా కరువులో ప్రజలపై ధరల భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ధరలు పెంచుతుండడం సిగ్గుచేటన్నారు. కరోనా కరువులో ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, ఏడాదికి 200 పని దినాలు కల్పించి రోజు కూలీ రూ.600లు చొప్పున చెల్లించాలని, పేద కుటుంబాలకు నెలకు రూ.7,500లు చొప్పున నగదు సాయం అందించాలని, కేరళలో అమలు చేస్తున్న తరహాలో పేదలకు రేషన్ షాపుల ద్వారా 16 రకాల నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి రాపర్తి సోమయ్య, నాయకులు విజేందర్, నక్క యాకయ్య, చిలువేరు మల్లేష్, కనకరాజు, ముక్కెర గంగరాజు, కన్నబోయిన నాగయ్య, వేల్పుల చిన్న రాజు, ఉప్పునూతల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.