Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 వేల మందికి పాజిటివ్
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
- వైద్య అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో రెండో దశ కోవిడ్-19లో కరోనాతో 251 మంది మతి చెందారని, మొత్తం 16 వేల 31 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, కరోనా మరణాలను నివారించేందుకు భవిష్యత్లో పకడ్భందీగా చర్యలు చేపడుతున్నట్టు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్లో రెండో దశ కోవిడ్-19 కేసులు, వ్యాక్సినేషన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు, ఆర్ఏటీ, ఆక్సీజన్ లభ్యత, ఇంటింటి సర్వే, పాజిటివ్ శాతం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులతో సోమవారం సమీక్షించారు. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు రెండో దశలో తీసుకున్న చర్యలు, కేసుల వివరాలు, ఆక్సీజన్ లభ్యత, పరీక్షలపై కలెక్టర్కు జిల్లా నోడల్ అధికారి రాజేష్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడారు. గతంలో లాక్డౌన్ వల్ల కేసుల శాతం తగ్గిందని, ప్రస్తుతం లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో గతంలో ఉన్న మాదిరిగా అన్ని రకాల చర్యలు తీసుకొని కేసులు పెరగకుండా చూడాలన్నారు. అందరికి వ్యాక్సినేషన్ త్వరగా పూర్తి చేసేలా చూడాలని చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేయడంతో కేసులు పెరిగే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు మాస్క్ ధరించడంతోపాటు ఇతర నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. తద్వారా కరోనా సోకకుండా కట్టడి చేయాలని చెప్పారు. భవిష్యత్తులో కరోనాతో ఎవ్వరూ మరణించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మందుల కొరత లేకుండా, ఆక్సీజన్ లభ్యత ఉండే విధంగా, ఫ్లో మీటర్లు, అన్ని సౌకర్యాలు ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీఓ కొమురయ్య, డీఎంహెచ్ఓ డాక్టర్ హరీష్రాజ్, జిల్లా ఏరియా ఆసుపత్రి కోఆర్డినేటర్ వెంకట్రాములు, డీపీఓ రఘువరన్, డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.