Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల సంరక్షణ అధికారి జి రాజకొమురయ్య
నవతెలంగాణ-టేకుమట్ల
బాల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు తప్పవని బాలల సంరక్షణ అధికారి జి రాజకొంరయ్య అన్నారు. బుధవారం మండలంలోని ఎంపేడు గ్రామంలో బాల్యవివాహం జరుగుతున్నదన్న సమాచారం మేరకు సీడబ్ల్యూసీ ఆదేశాలతో గ్రామానికి వెళ్లి బాల్య వివాహం నిలిపివేశారు. బాలికకు 18 సంవత్సరాలు నిండేవరకు వివాహం చేయమని తల్లి తండ్రుల నుండి హామీ పత్రాన్ని తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోవడం,బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన లేకపోవడం, ఆడపిల్లలు ఇంటికే భారమన్న అపోహల వల్ల బాల్యవివాహాలు చేయడానికి మొగ్గు చూపడం జరుగు తుందన్నారు. బాలికకు మెరుగైన విద్యావకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా బాల్యవివాహాలు చేసినా, బాల కార్మికులను ప్రోత్సహించినా, బాలలపై లైంగిక వేధింపులకు పాల్పడినా సంబంధిత అధికారులకు గానీ ,1098చైల్డ్ లైన్‌కు గానీ సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిర్మల, గ్రామ కార్యదర్శి శశికాంత్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ అచ్చారావు, వీఆర్వో హనుమంత్ నాయక్, సోషల్ వర్కర్ మాటేటి శైలజ, చైల్డ్ లైన్ టీం సభ్యులు సాయి కుమార్, హెడ్ కానిస్టేబుల్ బక్కయ్య, అంగన్వాడీ టీచర్లు హిమబిందు, సునీత తదితరులు పాల్గొన్నారు.