Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- న్యూశాయంపేట
గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రి ప్రసాద్ అన్నారు. హన్మకొండలోని, రాంనగర్ సుందరయ్య భవనంలో బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ఆధ్వర్యంలో గబ్బెట సతీష్ అధ్యక్షతన కార్మిక సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బుర్రి ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలను ఎస్సీ, ఎస్టీ, ఈతర కులాలుగా విభజన చేసి వేతనాలు ఇవ్వాలనే ఆలోచన చట్ట విరుద్ధమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్య అని అన్నారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాన్ని అమలు చేయడానికి కూలీలను కులాల వారిగా విభజన చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ అనా లోచిత చర్య వల్ల లక్షలాది మంది కూలీలు చేసే పనికి వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధి హామీ పని చేసిన జాబ్ కార్డు దారునికి 15 రోజులలో వేతనాలు చెల్లించాలని చట్టం చెపుతున్నా ఎస్సీ, ఎస్టీ, కూలీల వేతనాలు అపడం వారి హక్కులను హరించడ మేనన్నారు, ఉపాధి హామీ పని దినాలు 200 రోజులు పెంచాలని రూ.600 రోజుకూలీ ఇవ్వాలని కోరారు. కూలీలను కులాల వారిగా గ్రామీణ ఉపాధి హామీ వేతనాలు ఇవ్వాలనే ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న సుమారు రూ.కోటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేల్పుల రవి, గోల్కొండ కుమార్, బొక్కల రవి, ఆరూరి భాగ్య, జూకంటి పద్మ పాల్గొన్నారు.