Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
వ్యవసాయ రక్షణకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జూన్ 26న దేశవ్యాప్తంగా జరిగే ఛలో రాజ్ భవన్, జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే నిరసనలను జయప్రదం చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించి దేశాన్ని కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని ఏఐకెఎస్ సీసీ జిల్లా కన్వీనర్ పెద్దారపు రమేష్, కో కన్వీనర్లు సోమిడి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్లోని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యాలయంలో సుద్ధమల్ల భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన రైతు సంఘాల ఉమ్మడి జిల్లా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాని మోడీ తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు, నాలుగు కార్మిక కోడ్లను వెనక్కి తీసుకోవాలన్నారు. 200 రోజుల పైగా కార్మిక, కర్షక ఐక్య ఉద్యమం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. పంటకు స్వామీనాధన్ కమీషన్ సిఫార్సుల మేరకు మద్ధతు ధర ప్రకటిస్తామని మోసం చేసిందన్నారు. రైతాంగ ఉద్యమంపై నిర్భందం ప్రయోగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశద్రోహం, రాజద్రోహం కేసులను బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె హక్కును కాల రాస్తున్నారని అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని మండల డివిజన్ జిల్లా కేంద్రాల్లో ఆందోళన నిర్వహించి రాష్ట్రపతికి వినతిపత్రాలు పంపించి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రైతు సంఘాల జిల్లా బాధ్యులు ఎన్ రెడ్డి హంసా రెడ్డి, బీరం రాములు, పసునూరి రాజు, భాస్కర్, మురళి, కొమురయ్య పాల్గొన్నారు.