Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మెన్, కమిషనర్లకు ప్రజల వినతి
నవతెలంగాణ-తొర్రూరు
పట్టణంలోని సాయినగర్‌లో విద్యుత్ హైటెన్షన్ వైర్ల బిగింపు పనులు నిలిపేయాలని కోరుతూ ఆ కాలనీవాసులు డివిజన్ కేంద్రంలోని మున్సిపల్ కార్యా లయంలో చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్యకు, కమిషనర్ గుండె బాబుకు గురు వారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడారు. పట్టణంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు బిగింపులో నిబంధనలు పాటించడం లేదని చెప్పారు. ఇష్టానుసారంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని విమర్శించారు. 50 ఫీట్ల స్తంభాలపై 33 కేబీ హైటెన్షన్ వైర్లను బిగిస్తున్నారని, మెయిన్ రోడ్డుపై స్తంభాలు వేయకుండా కాలనీలో స్థంబాలు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. కాలనీలోని నారాబోయిన సాయమ్మ ఇంటి నుంచి పస్తం ఎల్లయ్య ఇంటి వరకు ఉన్న 10 ఫీట్ల రోడ్డులో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎల్టీకి 34-40 స్క్వేర్ ఎంఎం, 33 కేవీకి 80 స్వ్కేర్ ఎంఎం మందం తీగలు వేస్తున్నారన్నారు. కానీ ఒక్కోసారి హైఓల్టేజీ ప్రసరించడంతో తీగలు తెగి పడే ప్రమాదం ఉందన్నారు. కాలనీల్లో విద్యుత్ తీగల బిగింపు వల్ల హై ఓల్టేజీతో తీగల జీవిత కాలం దెబ్బతింటోందన్నారు. దీని ఫలితంగానూ తెగడం, కిందకు వేలాడటం వంటివి జరిగే ప్రమాదం ఉందన్నారు. అధికారులు చట్టాలను ఖాతరు చేయడం లేదని, ప్రమాదాలను దష్టిలో ఉంచుకొని పరిహారం చెల్లించేందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. 33 కెవి విద్యుత్ వైర్లు వలన అత్యధిక రేడియో ధార్మికత వెలువడుతుందని, దీనితో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. కాలనీలో విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయకుండా, మెయిన్ రోడ్ పై హైటెన్షన్ వైర్లు ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.