Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని విధుల్లో రాణించాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అన్నారు. గురువారం స్పెషల్ బ్రాంచ్ మరియు సీసీఆర్బీ విభాగాల్లో రెండు వారాలపాటు శిక్షణ పొందనున్న ప్రొబేషనరీ ఎస్సైలతో సన్నాహక సమావేశాన్ని కమిషనరేట్‌లో ఏర్పాటు చేశారు. ఐదు నెలల శిక్షణలో భాగంగా 61 మంది ప్రబేషనరీ ఎస్సైలు వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్, సెంట్రల్ క్రైం రికార్డ్స్ బ్యూరో విభాగాల్లో రెండు వారాలపాటు శిక్షణ పొందనున్నారు. ఈ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందించేది పోలీసులు మాత్రమేనన్నారు. శాంతి, భద్రతలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ముందుగా పోలీసులను ఆశ్రయిస్తారన్నారు. సమాజంలో పోలీసులకు వున్న ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకొని ప్రతి పోలీసు అధికారి ప్రజలకు న్యాయం జరిగే విధంగా విధులు నిర్వహించాల్సి వుంటుందన్నారు. మనం నిర్వహించే విధులపైనే పోలీసుల గౌరవ మర్యాదలు ఆధారపడి వుంటాయన్నారు. పోలీసు అదికారులు శిక్షణ సమయంలో నేర్చుకున్న అంశాలపై పట్టుసాధించడం ద్వారా భవిష్యత్తులో రాణించడంతోత పాటుగా ప్రజలకు మెరుగైన సేవలందించవచ్చని తెలిపారు. ఈ శిక్షణా సమయంలో అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. పోలీసు స్టేషన్లలో పోలీసులు సిబ్బంది నర్వహించే వివిధ రకాల డ్యూటీలపై ప్రతి స్టేషన్ అధికారికి అవగాహన కలిగించాల్సి వుంటుందన్నారు. అదేవిధంగా పోలీసు స్టేషన్ అధికారి బాధ్యతలు చేపట్టినప్పుడు తప్పనిసరిగా స్టేషన్ పరిధిలో జరిగే నేరాలపై అవగాహన పెంచుకోవడంతోపాటు అధికంగా జరిగే ఒకే రకమైన నేరాలకు గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరముందన్నారు. సిసిఆర్ది శిక్షణలో భాగంగా ప్రొబేషనరీ ఎస్సైలు తప్పనిసరిగా సిసిటిఎస్ఎస్, టిఎస్‌కాప్, టెక్ డ్యాం లాంటి పోలీసు టెక్నాలజీలపై పట్టు సాధించాల్సి వుంటుందన్నారు. తద్వారా రానున్న రోజుల్లో నేరాలను నియంత్రించడంతోపాటు నేరస్తులను గుర్తించడంలో ఈ టెక్నాలజీలను వినియోగించడం తప్పనిసరి అవుతుందన్నారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ డీసీపీలు వెంకటలక్ష్మీ, కె. పుష్ప, స్పెషల్ బ్రాంచ్ అదనపు డీసీపీ జనార్ధన్, సిసిఆర్డి ఏసీపీ ప్రతాప్‌కుమార్, ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, నరేష్కుమార్, రమేష్‌లు పాల్గొన్నారు.