Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్ధన్నపేట
మాదక ద్రవ్యాల వినియోగం నిషేదమని, వాటిని సరఫరా చేస్తే చట్టరీత్యా చర్య తీసుకుంటామని వర్ధన్నపేట ఏసీపీ గొర్ల రమేష్ హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో సీఐ విశ్వేశ్వర అధ్యక్షతన కిరాణా షాపు యజమానులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని సూచించారు. నిషేధిత మత్తుపదార్థాల వాడకం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తి ఆర్థికంగా ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. ఎవరైనా గుట్కా, గంజాయి ఇతర మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ పట్టుబడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే కాకుండా పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు. సీఐ విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. ఎవరైనా వ్యక్తులు మాదక ద్రవ్యాలు, మత్తుపదార్థాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిస్తే సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. మన పరిసర ప్రాంతాల నుండి మాదకద్రవ్యాలను తరిమికొట్టి మన ప్రాంతాన్ని మాదకద్రవ్య రహిత ప్రాంతంగా చేద్దామని ప్రతిజ్ఞ చేయించారు. ఎస్సై వంశీకష్ణ పోలీస్ సిబ్బంది, వ్యాపార దుకాణ యజమానులు తదితరులు పాల్గొన్నారు.