Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మన్యసీమ పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య
నవతెలంగాణ-మంగపేట
ఎస్సీ, ఎస్టీ చట్టాలను పకడ్బందీగా అమలు చేసి దళిత, గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న ప్రభుత్వ, రెవెన్యూ భూములకు పట్టాలివ్వాలని మన్యసీమ పరిరక్షణ సమితి డోల్దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని అకినేపల్లి మల్లారంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఎస్సీ, ఎస్టీ రైతులు పోడు చేసుకుంటున్న భూముల జోలికి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. గెజిట్లు ప్రకారం గుర్తించబడిన ప్రభుత్వ భూముల విషయంలో రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దని కోరారు. మంగపేట, తాడ్వాయి, ములుగు డీఎఫ్ఓలు ప్రభుత్వ గెజిట్లు తెలుసుకోకుండా దళిత, గిరిజన రైతుల జోలికి వస్తే సహించేది లేదన్నారు. అధికారులు చట్టాలను తెలుసుకొని చట్టాలకు అనుగుణంగా పని చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మంగపేట మండలవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులను సమీకరించి మంగపేట ఫారెస్ట్ రేంజర్, తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మన్యసీమ పరిరక్షణ సమితి మండల అధ్యక్షుడు పోలేబొయిన ఆదినారాయణ0, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యులు రాజమల్ల సుకుమార్, మండల పీసా కమిటీ అధ్యక్షుడు డబ్బుల ముత్యాలరావు పాల్గొన్నారు.