Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
వ్యవసాయ, కార్మిక, రైతు సంఘాల సంఘాల పిలుపు మేరకు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక జయశంకర్ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో 'సేవ్ అగ్రికల్చర్ -సేవ్ డెమోక్రసి' సందర్భంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లాఅద్యక్షులు కార్యదర్శి కంపెటి రాజయ్య, బొట్ల చక్రపాణి మాట్లాడుతూ.. బీజేపీ అధికారం లోకొచ్చిన ఏడేండ్లలో ప్రభుత్వ సంస్థల్ని ప్రయివేటు పరం చేస్తోందన్నారు. బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన వారికి రుణాలు మాఫీ చేయించి ప్రజల ధనాన్ని కార్పొరేటర్ పెట్టు బడి చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు పరం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలు, ఆధాని, అంబానీ, పెట్టుబడిదారుల కోసం చటాల్లో మార్పులు చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢల్లీీ సరిహద్దుల్లో లక్షలాదిమంది రైతులు పోరాడుతున్నారన్నారు. ఏడు నెలలల్లోనే రైతులపై అనేక సార్లు లాఠీచార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగించినా మొక్కవోని దీక్షతో రైతులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఇంటర్ నెట్ కట్ చేయడం లాంటివి చేసి, రైతులకు కరెంటు కట్ చేయడం, నీళ్ళ ట్యాంకర్లను అడ్డుకోవడం, స్థానికులు పేరుతో దాడులు, ఉగ్ర వాదుల పేరుతో ముద్ర వేయడం లాంటి కుట్రలు చేసిన పోరాటాన్ని ఆపలేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాస్వామికవాదులు, అన్ని సంఘాలవారు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమ్మయ్య, సురేష్, నాగేశ్వరరావు, రాజు, రమేష్, ఏఐటీయూసీ నాయకులు అమృతారావు, రాంబాబు, కోటిలింగం పాల్గొన్నారు.
'వ్యవసాయ రంగాన్ని కాపాడాలి'
జనగామ : వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, రైతు వ్యతిరేక 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం కేవీపీఎస్, డీివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఆవాజ్, గిరిజన సంఘం, ప్రజాసంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ యండి ఎత్తేషం ఆలీకి అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకుకనకా రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్రాజం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఏడు మాసాలకు పైగా రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతాంగం ఆందోళన చేస్తోందని, ఈపోరాటం చారిత్రాత్మకమని అన్నారు. కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని అప్పగించేందుకు చట్టాలు తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చట్టాలు అమలైతే దేశ ఆహార భద్రతకు పెను ముప్పు రానుందని, రైతాంగం భూముల నుండి గెంటివేయబడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు విడనాడాలని హితువు పలికారు. ప్రజా సంఘాల జిల్లా నాయకులు బొట్ల శేఖర్, బోడ నరేందర్, సింగారపు రమేష్ జొగు ప్రకాష్, ఎండీ అజారుద్దీన్, దేవదానం, తాండ్ర ఆనందం, కళ్యాణ లింగం, దూసరి నాగరాజు, గణేష్, మచ్చ వెంకన్న, మల్లేష్, రాజ్ కళ్యాణ్ పాల్గొన్నారు.
వెంటనే చట్టాలను రద్దు చేయాలి : రాపర్తి సోమయ్య
జఫర్గడ్ : ఢిల్లీలో రైతు ఉద్యమం ప్రారంభమై 7 నెలలు గడుస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చలనం లేకుండా ఉన్నందుకు నిరసనగా శనివారం మండల కేంద్రంలో రైతు సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ విజయకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోడీ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ దేశానికి చీకటి రోజులు తీసుకొచ్చా డన్నారు. నేడు వైద్యరంగం కార్పొరేట్ చేతుల్లోకెళ్తే ఎలాఉంటుందో కరోనా తెలియచేసిందని అన్నారు. లాక్డౌన్ సమయంలో ప్రతి కుటుంబానికి రూ.7500 నగదు, ఒక్కొక్కరికి పదికిలొల ఉచిత రేషన్ బియ్యం ఆరు నెళపాటు ఇవ్వాలన్నారు. ,కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందరికి ఇవ్వాలన్నారు. ఫ్రంట్ లైన్వారియర్స్కు రూ.50లక్షల బీమా కల్పించాలన్నారు. పీఎం కేర్స్ నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ మండల కార్యదర్శి యాతం సమ్మయ్య, మామిళ్ల మల్లయ్య, నల్లతీగల శీను, యాదగిరి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.