Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామ పంచాయతీ పాలకవర్గంలోని కొందరు అవగాహనా లోపంతో ఆరోపణలు చేస్తున్నారని పసర సర్పంచ్ ముద్దబోయిన రాము తెలిపారు. మండలంలోని పసర గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపసర్పంచ్తోపాటు కొందరు వార్డు సభ్యులు ఆధారాలు లేకుండా అవగాహనా లోపంతో ఆరోపణలు చేశారని చెప్పారు. నిబంధనల మేరకు నూతన భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. సదరు యజమాని ఇష్టారీతిన నిర్మించుకున్నాడని చెప్పారు. అందులో పంచాయతీ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. భూయజమానిపై చర్యలు తీసుకునేందుకు పంచాయతీ పరిధిలో ప్రయత్నించామని చెప్పారు. విద్యుత్ పరికరాలను ఇంట్లో పెట్టుకున్నాడని ఆరోపించడం సమంజసం కాదన్నారు. కార్యాలయంలోని స్టోర్ రూమ్లో అప్పటి పరిస్థితుల్లో అనుకూలంగా లేకపోవడంతో ఇంటి వద్ద ఉంచాల్సి వచ్చిందన్నారు. పల్లె ప్రకతి వనాల్లో అవినీతి లేదని చెప్పారు. మొదట్లో కేటాయించిన స్థలం ముంపునకు గురౌతుండగా ఆ తర్వాత అటవీశాఖ అధికారులు కేటాయించిన స్థలంలో మొక్కలు పెంచుతున్నట్టు తెలిపారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని తేటతెల్లం చేశారు. విచారణ అధికారికి సహకరించకుండా బహిష్కరించడం అర్థరహితమన్నారు. స్వల్ప విషయాలకు పత్రికలకు ఎక్కి పంచాయతీ పరువు తీయొద్దని హితవు పలికారు. రుజువులతో వస్తే ఎప్పుడైనా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మహేందర్ మాట్లాడారు. అన్ని సమావేశాల్లో ఆదాయ వ్యయాలను చదివి వినిపిస్తూ సభ్యుల అనుమతితోనే ఎజెండా, ఇతర అంశాలను చర్చిస్తున్నామని తెలిపారు. సభ్యులు అన్నట్టుగా ఇండ్ల మార్పిడి ఈ విషయంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. కరోనా పరిస్థితుల వల్ల అలా జరిగిందన్నారు. సహ చట్టం కింద కొందరు వార్డు సభ్యులు సమాచారం కోరినా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తిస్థాయిలో సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. వార్డుల వారీగా నిర్వహించిన కార్యక్రమాల సమాచారాన్ని వార్డు సభ్యులకు అందిస్తూ ప్రొటోకాల్ పాటిస్తున్నామని చెప్పారు. సమావేశంలో వార్డు సభ్యులు మోపిదేవి రామకృష్ణ, మువ్వ రామారావు, అన్నపూర్ణ, అనూష, గొంది గోపి, రేణుక, కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.