Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు చేసిందేమీ లేదని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు పత్తా లేకుండా పోయాయన్నారు. 2019-20, 2020-2021 ఆర్థిక సంవత్సరాలలో స్వయం ఉపాధి పథకాల కోసం 5.3లక్షల మంది యువత దరఖాస్తు చేసుకుంటే కేవలం 1.6 లక్షల మందికి మాత్రమే మంజూరు చేశారన్నారు. ఇటీవల కాలంలో 1.8 లక్షల మంది యువత దరఖాస్తులను స్వీకరించారు కానీ ఇప్పటివరకు అతీగతీ లేదు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టును భర్తీ చేసిన దాఖలాలు లేదు. ఇటీవల సీఎం కేసీఆర్ 1000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీతో దళితుల అభివద్ధికి చేస్తామని ప్రకటించడం మళ్లీ దళితులను మోసం చేయడమేనన్నారు. రాజ్యాంగం ప్రకారం దళితులకు రావలసిన వాటా కోసం, వారికీ దక్కాల్సిన హక్కుల కోసం, వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి ఉట్కూర్ రాములు, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కామెరా వెంకటరమణ, గడ్డం రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.