Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తి అయిన రోడ్డు విస్తరణ పనులు చివరి దశలో జంక్షన్ల సుందరీకరణ
- టీఎస్ బీపాస్‌తో సులభమైన అనుమతులు సాంకేతిక లోపాలు
- సవరించాలని ప్రజల వేడుకోలు..
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
బల్దియా పట్టణ ప్రణాళిక లక్ష్యాల దిశగా కొంత మేరకు దూసుకుపోతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివద్ధి దిశలో పరుగులెత్తడం వల్ల ఇక్కడ భూముల ధరలు పెరగడం గమనార్హం. భూ కబ్జాదారులు ఇదే అదునుగా భావించి హద్దులు చెరిపి వేసి డబుల్ రిజిస్ట్రేషన్లు చేయించడం వల్ల భూమి ఎవరిదో? అనుమతి పత్రాలు ఎవరికి ఇవ్వాలో? బల్దియా పట్టణ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొంత మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు చాకచక్యంతో విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని మేధావులు అంటున్నారు.
రోడ్ల విస్తరణే బల్దియా లక్ష్యం...
పెరుగుతున్న జనాభాకు అనువుగా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు రోడ్ల విస్తరణ పనులు జరిగేందుకు బల్దియా అంచనాల రూపొందించింది. ఆ అంచనాల ప్రకా రం పట్టణ ప్రణాళిక అధికారులు రోడ్ల విస్తరణ లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాజీపేట నుంచి పోలీస్ హెడ్ క్వార్టర్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ వరకు, పద్మాక్షి గుట్ట నుండి హన్మకొండ చౌరస్తా వరకు, పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి వెంకట్రామా జంక్షన్ వరకు వంద ఫీట్ల రోడ్లు నిర్మించడం పట్ల ప్రజలు హర్హం వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర సమస్యను ఎదుర్కొన్నారు. అలా మరొకసారి వరంగల్ నగరం జలమయం కాకుండా, ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నగర పరిధిలో 424 పురాతన శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి అధికారులు తొలగించారు. వరంగల్ నగరాన్ని ముంపు నుంచి కాపాడేందుకు ప్రధానమైన నాలాల విస్తరణ చేపట్టి నయీంనగర్ నాలా, భద్రకాళి నాలా, బొందివాగు నాలాలకు ఇరువైపులా వెలసిన 282అక్రమ కట్టడాలను తొలగించడం గమనార్హం.
సులభమైన అనుమతుల కోసం టీఎస్ బీపాస్ .
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పురపాలక చట్టం 12 ప్రకారం గతేడాది టీఎస్ బిపాస్ చట్టాన్ని ప్రవేశపెట్టింది. మూడు శాఖలైన ఆర్ అండ్ బి, ఇరిగేషన్, బల్దియా టౌన్ ప్లానింగ్ శాఖల సమన్వయంతో సునాయాసంగా భవన నిర్మాణ అనుమతులు పొందడానికి ఈ చట్టం వీలు కల్పించింది. 75 చదరపు గజాల స్థలం కలిగినవారికి స్వంత పూచీకత్తుపై ఎలాంటి రుసుము లేకుండా 7 మీటర్ల ఎత్తువరకు భవన నిర్మాణానికి అనుమతి ధ్రువీకరణ పత్రాలు జారీచేసి వెసులుబాటు విధించడం గమనార్హం. టీఎస్ బిపాస్లొ బల్దియా పరిధిలో సుమారుగా 845ఫైళ్లలో 680 ఫైళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి అనుమతి పత్రాలు అందజేశారు. అందులో సుమారు 165 ఫైళ్లు పెండింగ్ ఉండగా వాటిని పై అధికారులకు పంపించే దిశగా ఇప్పటికే బల్దియా అధికారులు చర్యలు చేపట్టారని తెలిసింది . కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఫైళ్లు పెండింగ్ ఉన్నాయని కొంత సమయం వరకు ప్రజలు సంయమనం పాటించితే టీఎస్ బి పాస్ ద్వారా అనుమతి పత్రాలు సునాయాసంగానే పొంద వచ్చని పట్టణ ప్రణాళికాధికారులు పేర్కొంటున్నారు .
సుందరీకరణ దిశగా జంక్షన్ ల విస్తరణ .
వరంగల్ నగరరంలో 12 జంక్షన్లను విశాలంగా నిర్మించి అధికారులు సంఉదరంగా తీర్చిదిద్దారు. మడికొండ ఫాతిమా జంక్షన్, వరంగల్ , అదాలత్ జంక్షన్, కేయూ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, హన్మకొండ చౌరస్తా జంక్షన్ , హన్మకొండ బస్టాండ్ జంక్షన్, వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు జంక్షన్, నాయుడు పెట్రోల్ పంపు జంక్షన్, ఉర్సు గుట్ట సీఎస్సార్ గార్డెన్ జంక్షన్ల సుందరీకరణ పనులు చివరిదశలో ఉన్నాయి. . వరంగల్ నగర సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని వావ్ వరంగల్ అని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.