Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'స్టేషన్' గులాబీల్లో వర్గపోరు
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోని ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల నడుమ మళ్లీ వార్ మొదలైంది. నియోజకవర్గంలో ఇద్దరి మధ్య సమసని ఆధిపత్య పోరు ఉన్నా అది కొంతకాలంగా స్తబ్దుగా ఉంది. ఈనెల 2న ఎమ్మెల్సీగా కడియం శ్రీహరి పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఆయన పదవీ కాలం ముగిసిందని, ప్రొటోకాల్ పాటించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలకు కడియం గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజాసేవ చేయడానికి పదవి, స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేదని సూటిగా చెప్పారు. ఇద్దరు నేతల వ్యాఖ్యల నేపథ్యంలో నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ రాజకీయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాక పుట్టించాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఈ వివాదం తాలూకు వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కడియం, తాటికొండల వ్యాఖ్యలు మరోసారి రాజకీయలను వేడెక్కించాయి. ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ ఘన్పూర్ లో మొదటి నుంచి ఈ ఇద్దరి నడుమ ఆధిపత్య పోరు సాగుతోంది. కడియం టీడీపీకి రాజీ నామా చేసి టీఆర్ఎస్లో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తొలి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ తాటికొండ రాజయ్య కడియం వర్గాన్ని దూరం పెట్టినట్టు ప్రచారంలో ఉంది. నాటి శాసనసభ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి టీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ కడియం శ్రీహరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. అనంతరం నియోజకవర్గంలో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శాసన సభ ఎన్నికల్లో డాక్టర్ రాజయ్య గెలుపు కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల
మేరకు కడియం వర్గం పూర్తి మద్దతు తెలిపింది. కొద్ది రోజులకే డిప్యూటీ సీఎం రాజయ్యను కేసీఆర్ బర్తరఫ్ చేసి ఆ స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఇరువురు నేతల నడుమ సఖ్యత లేదు. పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వచ్చింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. రెండోసారి శాసనసభ ఎన్నికల్లో కడియం శ్రీహరి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించినా రాజయ్యకే సీఎం కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారు. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కింది. కేబినెట్ లో మాత్రం కడియం ఆశించిన మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఇరువర్గాల నడుమ గ్యాప్ మరింతగా పెరిగింది.
సీఎం పర్యటన అనంతరం కడియం వ్యాఖ్యలు
ఎమ్మెల్సీగా కడియం పదవీ కాలం ముగిశాక సీఎం కేసీఆర్ తొలిసారిగా వరంగల్ నగరంలో పర్యటించిన సందర్భంగా కడియం నివాసంలోనే మధ్యాహ్న భోజనం చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అంతకు ముందే మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను భర్తరఫ్ చేయడం, ఆయన బీజేపీలో చేరడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిని పిలిపించుకుని సీఎం కేసీఆర్ చర్చించినట్టు ప్రచారంలో ఉంది. ఈ సందర్భంలోనే కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ కీలక హామీ ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విషయం టీఅర్ఎస్ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
కడియం స్ట్రాంగ్ కౌంటర్
కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇవ్వడం నియోజకవర్గంలో కలకలం సష్టించింది. ఎమ్మెల్యే రాజయ్య నియోజకవర్గంలో చేస్తున్న కార్యక్రమాలు, అవినీతిపై కడియం వర్గం పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేయనున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీఎం కేసీఆర్ హామీ నేపథ్యంలోనే ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి బహిరంగంగా కౌంటర్ ఇచ్చినట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదంపై పార్టీ అధినాయకత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే.