Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ ఇండియా కిసాన్ సభ
- ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ-మహబూబాబాద్
రైతులు నిరసన తెలపలేని కరోనా కల్లోల లాక్డౌన్ కాలంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో 'వ్యవసాయ సంస్కరణలు-మన విధానం' అంశంపై తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజన్న అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సెమినార్‌కు మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. సదరు చట్టాలు దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతాంగానికి నష్టదాయకమని చెప్పారు. గతేడాది జూన్ 5న అమల్లోకి తీసుకొచ్చిన మూడు చట్టాలు పార్లమెంటు రాజ్యసభలో ఆమోదం పొంది రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ కూడా అమల్లోకి వచ్చినట్టు తెలిపారు. ఆ చట్టాల వల్ల రైతాంగానికి ఉపయోగం లేదని, కార్పొరేట్ శక్తులు రైతులను దోచుకోవడానికి చట్టపరంగా అనుమతి ఇచ్చినట్టేనని తేటతెల్లం చేశారు. కార్పొరేట్ అనుకూలమైన మార్పులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఆ చట్టంలో ఉన్నాయని తెలిపారు. ఆ చట్టాల వల్ల నిత్యావసర సరుకుల చట్టం నీరుగారి పోతుందని ఆందోళన వెలిబుచ్చారు. దేశంలోని సంపద మొత్తం కొందరి చేతుల్లోకి పోతుందని చెప్పారు. పేదలకు ఆహార ధాన్యాలు అందకుండా పోతాయని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు పెద్దఎత్తున సరుకులు నిల్వ చేసి కత్రిమ కొరత సష్టించి ధరలు పెంచి పేదలను దోచుకునే అవకాశం ఉందన్నారు. రైతుల వద్ద కార్పొరేట్ సంస్థలు తక్కువ ధరకు కొనుగోలు చేసి నిల్వ చేసి అధిక ధరకు విక్రయిస్తాయని తెలిపారు. రైతన్న జోక్యం లేకుండా రైతు చట్టాలను సవరించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తక్షణమే వ్యవసాయ విద్యుత్ సంస్కరణ చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శోభన్ నాయక్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గునిగంటి రాజన్న, శెట్టి వెంకన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు యాకూబ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.