Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్
- డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ పద్మజ
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
'సింగరేణి ఏరియా ఆస్పత్రి పరిధిలో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. సాధారణ పరిస్థితులతో పోలిస్తే కరోనా నేపథ్యంలో ఆస్పత్రికొచ్చే వారి సంఖ్య కొంత తగ్గింది. వైద్య సిబ్బంది కొరత లేదు. వారం రోజుల్లో ఆక్సీప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సుమారు 7,400 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశాం. ఉన్నతాధికారులతోపాటు వైద్య సిబ్బంది ఒక టీం గా పని చేస్తూ సమస్యలు తల్తెకుండా పర్యవేక్షణ చేపడుతున్నాం. ఇది నాకు సంతృప్తినిచ్చింది.' అని భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ పద్మజ(ఎంబీబీఎస్ , గైనకాలజీ) నవతెలంగాణ ముఖాముఖితో వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే...
సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.?
జనరల్ విభాగం, చెవి-ముక్కు-గొంతు, కీళ్ళు ఎముకలు, శస్త్రచికిత్స విభాగాలలో వైద్యులు అందుబాటులో ఉన్నారు. 75 బెడ్లు ఉన్నాయి, ప్రత్యేకించి కరోనాకు 100 బెడ్లు, అందులో ఐసీయూ 32, జనరల్ వార్డ్‌లో 50, స్పెషల్ రూమ్స్ లో 18 అందుబాటులో ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 600మంది వచ్చేవారు. కానీ, కరోనా ప్రభావం వల్ల ప్రస్తుతం 250 నుంచి 300మంది వస్తున్నారు.
వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారా ?
పర్మినెంట్ గా పిల్లల వైద్య నిపుణులు లేరు, కానీ, అప్పుడే పుట్టిన పిల్లల అవసర నిమిత్తం బయటి నుంచి పిలిపిస్తున్నాం. సాధారణంగా రోజుకు గుండె, నరాల, మూత్రపిండాల సంబంధిత సూపర్ స్పెషలిస్ట్ సేవలకోసం 8 నుండి 10 కేసులు హైదరాబాద్, వరంగల్‌కు రెఫర్ చేస్తున్నాం.
కరోనా కేసులు... మీరు తీసుకున్న చర్యలు ?
సింగరేణి ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు 15,200మందికి కరోనా టెస్టులు చేయగా 1439మందికి పాజిటివ్ వచ్చింది. సింగరేణి ఆస్పత్రిలో, బయట టెస్టులు చేసుకున్న వారితో కలిసి మొత్తం 1882 పాజిటివ్ కేసులు కాగా, 1780మంది రికవరీ అయ్యారు. 71 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులో ముగ్గురు ఉండగా, 31 మంది చనిపోయారు. కరోనా బారిన పడిన 98 మందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ హాస్పిటల్స్‌కు తరలించార. వైద్య సిబ్బందితో నిరంతరం పర్యవేక్షణ చేపడుతూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నాం. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబీకులకు కలిపి మొత్తం సుమారు 7,400 మందికి వ్యాక్సిన్ వేయగా, అందులో 5,100 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంకా కొంతమందికి వివిధ కారణాల వల్ల జాప్యం జరుగుతోంది.
ఆస్పత్రిలో అన్ని రకాల వసతులున్నాయా ?
కాంట్రాక్టు సిబ్బంది, పర్మనెంట్ ఉద్యోగులతో వైద్య సిబ్బంది కొరత లేదు. మొత్తం ఏడు అంబులెన్సులు దాంట్లో ఒకటి మార్చురీ వ్యాన్ ఉంది. సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఆక్సిజన్ ప్లాంట్‌ను, సిటీ స్కాన్ యంత్రాన్ని మంజూరు చేశారు. వారం రోజుల్లో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. రెండు వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి.
చివరగా వైద్యసేవలపై మీ వివరణ ?
ఏరియా జనరల్ మేనేజర్ సహకారంతో కరోనా కట్టడికి వైద్యులు, సిబ్బంది టీంగా సేవలందించడం సంతృప్తినిచ్చింది. యాజమాన్యం కూడా అడిగిందే తడవుగా సహకారమందిస్తున్నారు. మెరుగైన వైద్య సేవలందించేందుకే మేం పాటుపడుతున్నాం.