Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50వేల మందితో చేరేందుకు సన్నాహలు !
నవతెలంగాణ-గణపురం
ఏఐఎఫ్బీ రాష్ట్రనాయకుడు గండ్ర సత్యనారాయణరావు త్వరలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ఏఐఎఫ్బీ పార్టీని తీసుకొచ్చి జాతీయ పార్టీ లకు ఇటు అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తూ కొలిమిరాణి కొయ్యగా మారాడు. నియోజకవర్గంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ప్రజల కష్టసఖాల్లో పాలు పంచుకుంటూ నేనున్నాంటూ భరోసా కల్పిస్తున్నారు. కాగా రేవంత్‌రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న గండ్ర సత్యనారాయణరావుకు ఇక నుండి మంచి రోజులు వచ్చాయని చెప్పక తప్పదు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీఫాం ఇచ్చినప్పటికి అది ఆలస్యంగా రావడంతో అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కుట్ర పన్ని టిక్కెట్ రాకుండా అడ్డు పడ్డాడని విమర్శలొచ్చాయి. మూడు పర్యాయాలు ఓటమికి గురై రెండో స్థానంలో నిలిచాడు. మూడు సార్లు ఓటమి చెందినా నిరుత్సాహపడకుండా ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల ఆదరణ పొందుతున్నాడు. గణపురం మండలంలో ప్రతి సారి అయనదే పై చేయి. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ స్థానాలు ఎక్కువ సంఖ్యలో గండ్ర చెప్పిన వారే గెలువడం ఆనవాయితీ. మండలంలో ప్రతి ఎమ్మెల్యే ఎంత అభివద్ధి చేసినా చివరికి ఓట్లు గండ్ర సత్యనారాయణరావుకే పడుతాయి. దీంతో ఎమ్మెల్యేగా ఉన్న నాయకులు గణపురం మండలంపై ప్రత్యేక దృష్టి పెడతారు. ప్రస్తుతం జెడ్పీటీసీ సత్యనారాయణరావు భార్య గండ్ర పద్మ, ఎంపీపీ కావటి రజిత, వైస్ ఎంపీపీ సైతం ఏఐఎఫ్బీపార్టీ వారే. అయితే రెవంత్ రెడ్డి ని భూపాలపల్లి కి రప్పించి భారీ బహిరంగసభను 50 వేల మందితో ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. గండ్ర కాంగ్రెస్ పార్టీలో చేరితే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. కాగా తన అనుచరులతో గండ్ర మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి తో గండ్ర ఫోన్ లో టచ్ లో ఉంటున్నట్లు సమాచారం. త్వరలో పెద్ద ఎత్తున పార్టీ లో చేరుతున్నట్లు తెలిసింది.