Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
నవతెలంగాణ-ములుగు
జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడో విడత హరితహారం, నాల్గో విడత పల్లె ప్రగతి కార్యాచరణపై సమీక్షించారు. వైద్య ఆరోగ్య, వ్యవసాయ, స్త్రీ శిశు సంక్షేమ, అటవీ, ఫిషరీస్, విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడారు. రైతులకు రెండు పంటలకు ఎకరాకు రూ.5 వేలు సాయం ప్రభుత్వం సాయం అందిస్తోందని తెలిపారు. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని పండించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి తాగు, సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని కొనియాడారు. సమ్మక్క సారలమ్మ బ్యారేజీ ప్రారంభానికి సిద్ధంగా ఉందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలన్నిటినీ భర్తీ చేస్తామన్నారు. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారని చెప్పారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కేంద్రంలో 57 వైద్య పరీక్షలు చేసేలా టీ-హబ్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాను రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఆదివాసీ గిరిజన, లంబాలను అభివృద్ధి చేసేందుకు హెల్త్ ప్రొఫైల్‌ను త్వరలో చేపట్టనున్నట్టు తెలిపారు. ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రామప్పను టూరిస్ట్ హబ్‌గా యునెస్కో గుర్తించేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. జిల్లా కేంద్రంలోని టీ-హబ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్యను కోరారు. పోడు భూముల విషయంలో ఆదివాసీ గిరిజనులకు నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పల్లె ప్రకతి వనం, వైకుంఠదామాల నిర్మాణాలపై అధికార యంత్రాంగి ప్రత్యేక దృష్టి సారించి ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాక్, ఇతర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాల అమలులో ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య మాట్లాడుతూ పల్లె ప్రగతి నాల్గో విడతలో అధికారులు, ప్రజాప్రతినిధులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో రేపు సమీక్షించాలని సూచించారు. దళిత, గిరిజన వాడల్లో అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామాల్లో ఉపయోగం లేని బోర్ బావులుంటే పూడ్చాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఎవెన్యు ప్లాంటేషన్ ఏర్పాటు చేసే క్రమంలో నాటిన మొక్కలను రక్షించే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అనంతరం హరితహారం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జెడ్పీ సీఈఓ ప్రసూనా రాణి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
'పోడు'పై కమిషన్‌ను నియమించాలి
మంత్రి సత్యవతికి తుడుందెబ్బ వినతి
పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ వినతిపత్రం అందించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం అనంతరం అరుణ్ ఆధ్వర్యంలోని బృందం మంత్రిని కలిసి సమస్యలను విరవించారు. అనంతరం జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్‌కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలం కిషోర్, జిల్లా ఉపాధ్యక్షుడు యెట్టి ప్రకాష్ పాల్గొన్నారు.