Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వార్
నవతెలంగాణ-వరంగల్
అధికార టీఆర్ఎస్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సయోధ్య కరువై విభేధాలు బహిర్గతమవుతున్నాయి. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎంపిక కావడం, మరోవైపు బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలం పుంజుకుంటుండడం... రాజకీయంగా చర్చనీయమవుతోంది. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సన్నిహిత సంబంధాలుండడంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశముంది. ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు, రేవంత్‌రెడ్డికి నాడు టీడీపీలో ఉన్నప్పుడు వైరం ఉన్నది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాపై రేవంత్‌రెడ్డి ప్రత్యేక నిఘా పెట్టే అవకాశమూ లేకపోలేదు. ఉమ్మడి జిల్లాలోని 11మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య సమన్వయం కొరవడడం, వారి నియోజకవర్గాల్లో విభేధాలు తరుచూ బహిర్గతమవుతుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్కు గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు సమావేశాల్లో, సీఎం పర్యటనలోనూ ఇవి చర్చనీయాంశంగా మారాయి
ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులుగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ కొనసాగుతున్నారు. కానీ, వారికి ఎమ్మెల్యేల మద్దతు కొరవడు తోంది. తరుచూ విభేధాలు నెలకొంటుండడంతో టీఆర్ఎస్ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా నర్సం పేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి వాహ నాన్ని నగరంలో పోలీసులు అడ్డుకోవడంతో నిరసనగా పోలీసు హెడ్ క్వార్టర్స్ నుండి ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్ వరకు కాలినడకన చేరుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను అడ్డుకోవడం వెనుక మంత్రి 'ఎర్రబెల్లి' హస్తముందని 'పెద్ది' భావిస్తున్నట్టు ప్రచారం. ఈ పరాభవంతో ఎమ్మెల్యే 'పెద్ది' సీఎం కేసీఆర్ పర్యటనకు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య వార్ నెలకొంది. వరంగల్ నగరంలో ఛీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌తో సయోధ్య లేదు. తమ నియోజకవర్గాల్లో మంత్రి జోక్యం చేసుకుంటున్నాడని ఇద్దరు ఎమ్మెల్యేలు అధిష్టానం వద్ద ఫిర్యాదు చేయడం పార్టీలో కలకలం సృష్టించింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనూ దీని ప్రభావం పడింది. ఒక్క కార్పొరేటర్‌నే కలిగి వున్న బీజేపీ తాజా ఎన్నికల్లో 10 కార్పొరేటర్ స్థానాలను దక్కించుకుని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బీజేపీ పాగా వేసింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎసీపీలు, సీఐల బదిలీల్లో మంత్రి జోక్యం చేసుకోవడం పట్ల ఛీఫ్ విప్ 'దాస్యం' గుర్రుగా ఉన్నారు. మరోవైపు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్ తనకు గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్రను టీఆర్ఎస్లోకి తీసుకొచ్చి ఆయన్ను మంత్రి తిప్పుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌తోనూ సఖ్యత చెడిందని ప్రచారం. వరంగల్ రూరల్ జిల్లాలో వర్ధన్నపేట మండలం ఇల్లందలో పిహెచ్సి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేయడాన్ని మంత్రి దయాకర్‌రావు అడ్డుకున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాట, మాట పెరిగింది. నర్సంపేట నియోజకవర్గంలోనూ సమీక్షా సమావేశాల్లో ఎమ్మెల్యే 'పెద్ది' ప్రసంగానికి మంత్రి తరుచు అడ్డుతగులుతుండడం పట్ల ఆయన తీవ్ర అసహనంతో వున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిలతో మంత్రి దయాకర్‌రావుకు ముందు నుండి సమన్వయం లేదు. ఈ క్రమంలో జిల్లాలో మంత్రికి క్రమక్రమంగా ఎమ్మెల్యేల నుండి వ్యతిరేకత పెరుగుతున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌కు డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ మధ్య సయోధ్య లేదు. మంత్రికి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు మధ్య సమన్వయం లేదు. ఎమ్మెల్యేల మద్దతు, సహకారం లేకపోవడంతో మంత్రి సత్యవతి రాథోడ్ ఆ జిల్లాలో ఏమి చేయలేని దుస్థితి నెలకొంది. ములుగు ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌కు చెందిన సీతక్క ఉన్నారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే బాస్ అని తరుచూ పేర్కొనడంతో ఎమ్మెల్యేలను కాదని మంత్రులు ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ఎక్కడన్నా మంత్రి జోక్యం చేసుకుంటే అక్కడ విభేధాలు తలెత్తి గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటీవల డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఎలా వుందో, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు అలాగే వుంది. తరుచూ ఇద్దరి వ్యాఖ్యలు ఆయా నియోజకవర్గాల్లోనే కాకుండా జిల్లావ్యాప్తంగా అధికార టిఆర్ఎస్ వర్గ విభేధాలను బహిర్గతం చేస్తున్నాయి.