Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
నవతెలంగాణ-హన్మకొండ
డివిజన్ సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి కార్యక్రమం అని వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అన్నారు. పట్టణ ప్రగతి రెండవ రోజులో భాగంగా శుక్రవారం 6వ డివిజన్, 60వ డివిజన్లో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. వడ్డెపల్లిలోని ముదిరాజ్ వీధిలో హరితహారంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు . 6వ డివిజన్లో మురికి కాలువలో పేరుకపోయిన చెత్తా చెదారం పూర్తిగా తీసివేయాలని, శిధిలావస్థలో మురికి కాలువలకు మరమ్మ తులు చేయాలని తెలిపారు. అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించి మొక్కలను విస్తృతంగా నాటించాలని, రోడ్ల వెంబడి మొక్కలతో పాటు వాటికి రక్షణగా ట్రీ గార్డ్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్నపాటి వర్షానికే రోడ్లు బురదమయం అవుతున్నాయని, వరద నీరు ఇళ్లలోకి వస్తుందని కాలనీవాసులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా స్పందించిన కలెక్టర్ విజయపాల్కాలనీ వర్షపు నీరు వెళ్లడానికి అవసరమైన కాలువలు నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిం చారు. ఖాళీ స్థలాలలో చెత్త ఉన్నట్లయితే సంబందిత యజమానులకు తక్షణమే నోటీసులు జారీ చేసి చెత్తను ఎత్తివేసే విధంగా కార్పోరేషన్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు డివిజన్లలో పారిశుద్య నిర్వహణ సక్రమంగా ఉండాలని, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ వేయాలని తెలిపారు. వర్షాకాలం వచ్చినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, పట్టణ ప్రగతిలో నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ సత్యనారాయణ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజారెడ్డి, చీఫ్ హర్టికల్చర్ఆఫీసర్ సునిత కార్పోరేటర్లు మధు, అభినవ్ , ప్రత్యేక అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.