Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ-హసన్‌పర్తి
గొప్ప సంస్కరణలకు ఆరాధ్యుడు పీవీ నరసింహారావు అని కేయూ వీసీ ఆచార్య టి రమేష్ అన్నారు. శుక్రవారం కేయూ సెనెట్ హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేయూకు పీవీ నరసింహారావు విజ్ఞాన పీఠం ఏర్పాటుకు ప్రతిపాదనలను ఆమోదించినం దుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చి వేసిన వ్యక్తి పీవీ అన్నారు. పాఠశాల, ఉన్నత విద్యలో 1986 విద్యా విధాన రూపకర్త గురుకుల, నవోదయల మార్పులకు మూలపురుషుడు పీవీ అన్నారు. పీవీ, యూజీసీ వికేంద్రీకరణ, న్యాక్ ఏర్పాటు, కారాగారాల్లో ఖైదీలకు చదువుకునే అవకాశం, ఓపెన్ జైలు విధానం దేశంలోనే మొట్టమొదటి విధానమన్నారు. పీవిని గుర్తించి ఆయనపై అధ్యయనం చేయడానికి పీవీ విజ్ఞాన పీఠం ఏర్పాటు చేయబడుతుందన్నారు. తెలంగాణ చరిత్ర, భాషా, సంస్కృతి, సామాజిక, ఆర్థిక రంగాలపై పీవీ తీసుకొచ్చిన భూసంస్కరణలు వాటి ప్రభావం సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులపై విషయ నిపుణులచే లెక్చర్లు, సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, కార్యశాలలు, అధ్యయనాలు చేపడుతామన్నారు. పీవీ రచనలు తదితర వాటితో డిజిటల్ లైబ్రరీ రూపొందిస్తామని తెలిపారు. పీవీ జీవితం, వివిద రంగాలకు చేసిన సేవలపై వివిద విధానాల ద్వారా, మాద్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పరిపాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, వారిపై వారి జీవితంపై చేసిన పరిశోధనలను డిజిటల్ రూపంలో అధ్యాపకులకు, పరిశోధకులకు, విద్యార్థులకు అందుబాటు లోకి తెస్తామన్నారు. యువతలో నిరాశా, నిస్పృహ, నిసత్తువ పోగొట్టేందుకు శిక్షణ తరగతుల నిర్వాహణ, వారి పేర ఒక జర్నల్ కూడా తీయటానికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రభుత్వంతో సంప్రదించి నిధులు రాబడుతామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 1.40 కోట్ల ఎకరాలకు సాగునీరందించటడంతో పాటు తెలంగాణ దక్షిణ భారత ధాన్యాగారంగా మారిందని అన్నారు. నిరంతర విద్యుత్‌తో తెలంగాణ అభివృద్ది పథంలో దూసుకుపోతుందన్నారు. రైతు బందు, బీమా, పింఛన్లు వంటి సంక్షేమ పథకాలతో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా ఉందని కొనియాడారు. బోధనా, పరిశోధన, ఉద్యోగుల అభివృద్ది, న్యాక్ గుర్తింపు, యూనివర్సిటీ ఆస్తుల పరిరక్షణకు ప్రహరి నిర్మాణం, నియామకాలకు పెద్ద పీఠ వేస్తామన్నారు. ఈ సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఆర్ మల్లికార్జునరెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి, ఆచార్య వి రామచంద్రం, ఆచార్య కె డేవిడ్, ఆచార్య బన్న అయిలయ్య, తోట రాజయ్య, పాల్గొన్నారు.