Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్,
- ఎంపీ పసునూరి దయాకర్
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-చిట్యాల
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఓడితల గ్రామంలో పీహెచ్సీ ఆవరణలో మొక్కలు నాటి ఆస్పత్రిని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాలన్నీ పచ్చదనంతో వెల్లివిరియాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష నెరవేరేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకా అందేలా చూడాలన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందించి సంరక్షించేలా విధంగా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ విద్యుత్ కష్టాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే స్థాయి నుండి నేడు 24 గంటల విద్యుత్ అందించేస్థాయికి చేరుకున్నామన్నారు. రైతుబంధు, కళ్యాణ లక్ష్మి ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్ తదితర అనేక సంక్షేమ పథకాలను ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ అమలుపరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్న గొప్ప నేత సీఎం కేసీఆర్ అన్నారు. దళితుల్లో వెలుగు నింపేందుకే దళిత క్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, జెడ్పీ చైర్మెన్ జక్కు శ్రీ హర్షిని, జెడ్పీ సీఈవో శోభారాణి, డీపీఓ ఆశాలత, మండల స్పెషల్ ఆఫీసర్ శైలజా ఎంపీడీవో రవీంద్రనాథ్, జెడ్పీటీసీ గొర్రె సాగర్, ఎంపీపీ దావు వినోదవీరారెడ్డి,పీఏసీఎస్ చైర్మెన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కామెడీ రత్నాకర్‌రెడ్డి, సర్పంచ్ సాంబ లక్ష్మి, ఇన్చార్జి సర్పంచ్ పూర్ణచంద్రరావు, ఎంపీటీసీ పద్మ నరేందర్ పాల్గొన్నారు.
మంత్రికి ఆశావర్కర్ల వినతి
పీఆర్సీ అమలులో ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆశా వర్కర్లు ఆవేదన చెందుతూ ఓడితల పీహెచ్సీలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆశాలు మాట్లాడుతూ.. పీఆర్సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే సవరించాలని, ఆశలకు ఫిక్సిడ్ వేతన నిర్ణయం చేసి ఆపై 30 శాతం వేతనం చెల్లించాలని కోరారు. ఇతర చట్టబద్ధ సౌకర్యాలు కల్పిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. గ్రామాలలో 11వ పీఆర్సీ ఆశాలకు కూడా వర్తింప చేస్తామని ప్రకటన చేశారని, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో మళ్లీ పారితోషికాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించిం దన్నారు. ఫిక్స్డ్ వేతనాన్ని ప్రకటిస్తామని స్పష్టత ఇవ్వక పోవడం పట్ల ఆందోళన చెందుతుందున్నామన్నారు. కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా లకు 7 200 జీతం పైన పిఆర్సీ అమలు చేయాలని పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతి ద్వారా ఫిక్స్డ్ వేతనాలు అమలుజేయాలని కోరారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. స్పందించిన మంత్రి, ఎమ్మెల్యే ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం లోనే ఆశాలకు అధిక జీతాలు ఇస్తున్నామన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు రాధిక, లావణ్య స్వప్న, ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.