Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికార పార్టీ మెజార్టీ
- జెడ్పీటీసీల అసమ్మతి రాగం
- అవిశ్వాసం పెట్టేందుకు సమాయత్తం
- ఒంటెద్దు పోకడలు సహించలేకే..
నవతెలంగాణ-మంగపేట
ములుగు జిల్లా టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నడుమ పొడ చూపిన విబేధాలు చివరకు జెడ్పీ చైర్మెన్ జగదీష్ కుర్చీకి ఎసరు తెస్తున్నాయి. జెడ్పీ చైర్మెన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే దిశగా అడుగులు పడుతుండటం గమనార్హం. జెడ్పీ చైర్మెన్ ఒంటెద్దు పొకడ పోతున్నా రని కొద్దికాలంగా అధికార పార్టీ జెడ్పీటీసీలు తీవ్ర అసమ్మతితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇటీ వల జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో నలుగురు అధికార పార్టీ జెడ్పీటీసీలు పాల్గొనకుండా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు తెలిసేలా నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. ఆ రోజు తర్వాత కూడా పార్టీ జెడ్పీటీసీల ఆగ్రహావేశాలు చల్లారలేదు. జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ ఇతర మండలాల జెడ్పీటీసీలను ఖాతరు చేయడం లేదని, అభివృద్ధి నిధులు మండలాలకు కేటాయించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని అసమ్మతి జెడ్పీటీసీలు చెబుతున్నారు. పార్టీ కోసం పని చేసే వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాఅశం కల్పిస్తున్నారని విమర్శిస్తున్నారు.
మంత్రి మాటను ధిక్కరించిన జెడ్పీ చైర్మెన్
ఏటూరునాగారం, మంగపేట మండలాలకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలతో జెడ్పీ చైర్మెన్‌కు విభేదాలు నెలకొన్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన పంచాయతీ కాస్త ఓ మంత్రి దగ్గరకు చేరినట్టు సమాచారం. సదరు మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా జెడ్పీ చైర్మెన్ ధిక్కరించినట్టు తెలుస్తోంది. జిల్లాలో జరిగే అన్ని అభివద్ధి కార్యక్రమాలకు ఆయనే భాషాగా, ఇసుక ర్యాంపులు సైతం తన అనుమతితో మాత్రమే నిర్వహించాలని అధికారులకు హుకుం జారీ చేసే అధికార పార్టీ ముఖ్య నేతకు సంబంధించిన ఇసుక క్వారీని సైతం రద్దు చేయడంతో అసలు ముసలం మొదలైందనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.
అవిశ్వాసం వైపు అడుగులు..
జిల్లాలో 9 మండలాలుండగా మంగపేట మినహా 8 మండలాలకు ఎన్నికలు జరిగాయి. ఒక స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఏడింటిని టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసుకుంది. ఏటూరునాగారం జెడ్పీటీసీగా విజయం సాధించిన కుసుమ జగదీష్ మెజార్టీ సభ్యుల ఓటింగ్‌తో జెడ్పీ చైర్మెన్‌గా, తాడ్వాయి జెడ్పీటీసీ బడే నాగజ్యోతి వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన విషయం తెలిసిందే. గోవిందరావుపేట జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, ములుగు జెడ్పీటీసీ సకినాల భవానీ, వెంకటాపుర్ జెడ్పీటీసీ రుద్రమదేవి జెడ్పీ చైర్మెన్‌పై అసమ్మతితో ఉన్నారు. వాజేడు, వెంకటాపురం జెడ్పీటీసీలు మాత్రమే కుసుమ జగదీష్‌కు మద్దతుగా ఉన్నారు. మెజార్టీ అధికార పార్టీ సభ్యులు అసమ్మతి రాగం వినిపిస్తుండటంతో కాంగ్రెస్ జెడ్పీటీసీని కలుపుకుంటే చైర్మెన్‌పై అవిశ్వాసం పెట్టి నెగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.