Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ అర్బన్ జిల్లా కార్యదర్శి మేకల రవి
నవతెలంగాణ-ఖిలా వరంగల్
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి డిమాండ్ చేశారు. సోమవారం వరంగల్ నగర సమితి ఆధ్వర్యంలో అండర్‌బ్రిడ్జి జీపుల అడ్డా వద్ద ధరల పెరుగుదలను నిరసిస్తూ రిక్షాలు తొక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడ విడ్డూరంగా ఉందన్నారు. చమురు ధరలన పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోయారు. సీపీఐ గ్రేటర్ వరంగల్ నగర కార్యదర్శి షేక్ భాషుమియా మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌ల ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. కరోన కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తెసి ధరలను విపరీతంగా పెంచుతూ ప్రజల నడ్డివిరుస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీపీఐ గ్రేటర్ వరంగల్ నగర సహాయ కార్యదర్సులు బుస్స రవీందర్, గన్నారపు రమేష్, నగర నాయకులు సంగి ఎలేందర్, ఎండీ అక్బర్, ఉప్పుల రవి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నర్సంపేట
పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో కట్టెల పొయ్యితో వంటావార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు కరోనాతో అతలాకుతమౌతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ధరలను పెంచి పేద, సామాన్యులపై తీరని భారాన్ని మోపుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతూ భారాలను నెత్తిమీదు రుద్దుతుందని విమర్శించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలకు దళారిగా మారాడని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచడం వల్ల నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో ప్రాణాలను కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతున్న క్రమంలో పెంచిన ధరలతో సామాన్యులు ఎలా బ్రతుకేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే పెంచిన ధరలను తగ్గించాలన్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు తోట చంద్రకళ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అక్కపెళ్లి రమేష్, జిల్లా నాయకులు గడ్డం యాకయ్య, పాల కవిత, గోవర్ధన్ మియాపురం, ఐయితే యాకోబు పాల్గొన్నారు.
నవతెలంగాణ-హన్మకొండ
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కర్రె బిక్షపతి విమర్శించారు. సోమవారం స్థానిక కాళోజి సెంటర్లో పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును నిరసిస్తూ మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మద్యల ఎల్లేష్, గిన్నారపు రోహిత్, నరేష్ ద్రావిడ్, గుండె బద్రి, ఖండే నరసయ్య, ల్యాడేళ్ల శరత్, రమేష్, రవి, బిక్షపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఎల్కతుర్తి
పెట్రో ఉత్పత్తుల ధరల పెంపునకు నిరసనగా మండల కేంద్రంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల సమితి కార్యదర్శి ఉట్కూరు రాములు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించి సామాన్య ప్రజనీకాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్ర లక్ష్మణ్, తండ మొండయ్య, బొంత మల్లయ్య, యల్లా భాస్కర్ రెడ్డి, కంచర్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.