Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్
నవతెలంగాణ-గూడూరు
దళితులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలని, వందేండ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని లాక్కొని మొక్కలు నాటడం ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యానికి నిదర్శనమని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కుర్ర మహేష్ అన్నారు. బుధవారం మండల పరిధి బోల్లపల్లి గ్రామంలోని దళితుల భూములు ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకుని మొక్కలు నాటుతున్న క్రమంలో ఆ ప్రాంతాన్ని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహేష్ సందర్శించి మాట్లాడారు. మహబూబాబాద్ అటవీ శాఖ కార్యాలయం పరిధి బొల్లెపల్లి గ్రామంలోని 20 దళిత కుటుంబాలు వంద సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న భూమిలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యంగా మొక్కలు నాటడం సరికాదన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని దళితుల భూముల్ని రక్షించాలని డిమాండ్ చేశారు. దళితుల సాధికారత పేరుతో దళితులకు అనేక జీవోలను సమీక్షిస్తూ వారి ప్రగతి ప్రాతిపదికగా పని చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు దళితుల భూములు గుంజుకుని ప్లాంటేషన్ చేయడం సిగ్గు చేటన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 35- 70 సంవత్సరాలు సాగులో ఉన్న గిరిజనేతరులకు హక్కులను కల్పించినా భూములు గుంజుకోవడం అన్యాయమన్నారు. 2005 డిసెంబరు 13 నాటికి 35- 70 ఏళ్లకు పైగా సాగులో ఉన్న వారికి ప్రభుత్వం ఫారెస్టు అధికారులు సర్వే నిర్వహించి హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. దళితులకు హద్దులు నిర్ధారించి హక్కు పత్రాలు ఇచ్చి రక్షణ కల్పించాలన్నారు. లేదం ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మందుల సారయ్య జనగాం వెంకన్న, హెచ్ శ్రీను, హెచ్ వెంకన్న, కొరియర్ సారయ్య, కాకర్ల వెంకన్న, కాకర్ల కొమురయ్య, కోరే చిన్న సాయిలు, కోరే కష్ణ, రాములు, లక్ష్మయ్య, అశోక్, వేణు, చిలకమ్మ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.