Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె నిఖిల
నవతెలంగాణ-జనగామ
పల్లె ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె నిఖిల అన్నారు. బుధవారం కలెక్టర్ దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో పర్యటించి, పల్లె ప్రగతి పనుల తనిఖీలు చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో కాలినడకన పర్యటించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సమస్యను గుర్తించి, విద్యుత్ ఎస్ఈకి ఫోన్ చేసి, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తొలగించి, క్రొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో అవసరమున్న 50 నుండి 60 అదనపు విద్యుత్ స్తంభాలు, వైరింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధంచేసి సమర్పించాలన్నారు. రెండు, మూడు రోజుల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేశారు. కేంద్రానికి పిల్లలు వచ్చే లోపు టాయిలెట్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రకృతివనం సందర్శించి మొక్క నాటారు. జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి, ఉపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడారు. జూమ్, టిసాట్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నట్లు, ప్రత్యక్ష తరగతులు లేనందున, పాఠశాల సిబ్బంది గ్రామంలో స్వచ్ఛంద సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. అనంతరం నర్సరీ సెగ్రిగేషన్ షెడ్లను పరిశీలించి డిమాండ్ ఉన్న మొక్కలు పెంచాలన్నారు. అనంతరం సెగ్రిగేషన్ షెడ్, శ్మశాన వాటికలను పరిశీలించారు. గ్రామంలో రహదారులకిరువైపులా మొక్కలు నాటాలని, ఎక్కడా పచ్చదనం లేకుండా ఖాళీ ప్రదేశం కన్పించకూడదని అన్నారు. ఇండ్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశుభ్రం చేసుకోవాలని అన్నారు. నీటి ట్యాంకులను శుభ్రం చేసి, క్లోరినేషన్ చేయాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయిల్ బాల్స్, యాంటీ లార్వా, ఫాగింగ్ చేపట్టాలన్నారు. ప్రజలకు పల్లె ప్రగతి కార్యక్రమంపై అవగాహన కల్పించి, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఆర్డీఓ జి. రాంరెడ్డి, డీపీఓ కె రంగాచారి, ఎంపీడీఓ ఉమామహేశ్వర్, గ్రామ సర్పంచ్ బెల్లీనా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వేగవంతం చేయాలి : అదనపు కలెక్టర్
పట్టణ పరిధిలో ఏర్పాటుచేస్తున్న పట్టణ ప్రకృతి వనాల పనుల్లో వేగం పెంచి వచ్చే శుక్రవారం ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అదనపు కలెక్టర అబ్దుల్ హమీద్ అన్నారు. బుధవారం పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీ, విద్యానగర్, కిష్టబావి, జూనియర్ కళాశాల, అంబేద్కర్ నగర్ లలో పట్టణ ప్రకృతి వనాల పనులను పరిశీలించారు. పట్టణ ప్రకృతి వనాలను సుందరంగా తయారు చేయాలని, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు. కలరింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నేమ్ బోర్డు, గేట్ ఏర్పాటుచేయాలని అన్నారు. పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి, సిద్దం చేయాలన్నారు. అనంతరం 5వ వార్డ్ బాణాపురం ఇందిరమ్మ కాలనిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పిచ్చి మొక్కలు, పొదల తొలగింపులను పనులను పరిశీలించారు. పరిసరాలను పచ్చదనంతోను, పరిశుభ్రంగాను ఉంచాలన్నారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు. ఖాళీ ప్లాట్లలో పిచ్చి మొక్కలు, చెట్ల పొదలు, చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా ఉంటే, సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చి శుభ్రతకు చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కేవలం అధికారులు, ప్రజాప్రతినిధులది కాదని ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహ, అధికారులు తదితరులు పాల్గొన్నారు
అదనంగా వాహనాలు కొనుగోలు చేయాలి : కలెక్టర్
మరిపెడ : పట్టణ ప్రగతి పనులను వేగవంతంగా చేపట్టేందుకు మున్సిపాలిటీలో అదనంగా వాహనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం పట్టణ ప్రగతి లో భాగంగా కలెక్టర్ మున్సిపల్ చైర్ పర్సన్ సింధూరతో కలిసి పట్టణ ప్రగతిని, శ్మశాన వాటిక పనులను, సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ తీరును, మోడల్ మార్కెట్ తో పాటు ఆడిటోరియం నిర్మాణ పనులను సందర్శించి పరిశీలించారు. తొలుత పట్టణంలో పరిశుభ్రత, హరితహారాన్ని పరిశీలించారు. ప్రతి షాపు వద్ద మొక్కలు ఏర్పాటు చేసేందుకు కుండీలను పెట్టించాలని అన్నారు. ఈద్గా స్థలాన్ని పరిశుభ్రం చేయించాలని, ఖాళీ స్థలాల్లో పరిశుభ్రత చేపట్టి క్రీడా మైదానంగా వినియోగించాలన్నారు. డంపింగ్ యార్డ్ ను సందర్శించి దుర్వాసన వెదజల్లడంతో కోళ్ల వ్యర్ధాల సేకరణను వేరుగా చేపట్టేందుకు వ్యాపారులను సమావేశపరిచి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలకు ఫెన్సింగ్ చేయించాలని తాసిల్దార్ ను ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు కనిపించడం లేదని మున్సిపల్ కమిషనర్‌ను ప్రశ్నిస్తూ పదవ తేదీ లోపు మొక్కలను నాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు .లేఅవుట్ స్థలాలలో కేటాయించిన 10 శాతం గ్రీన్ బడ్జెట్ కు కేటాయించిన స్థలాలలో ఏర్పాటుచేసిన పట్టణ ప్రకతి వనాలను కలెక్టర్ సందర్శిస్తూ మొరంతో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని అన్నారు. పట్టణంలో నిర్మిస్తున్న కూరగాయల మోడల్ మార్కెట్ ఆడిటోరియం నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు తో కలిసి పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేయించాలన్నారు. అనంతరం పురపాలక సంఘ భవనంలో రెండవ విడత పట్టణ ప్రగతి సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ మొత్తం గ్రాంటు, ఖర్చు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతికి రెండు కోట్లు మంజూరయ్యాయని, విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించామని, టాయిలెట్స్ నిర్మాణాలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణకు మున్సిపాలిటీకి 2 ట్రాక్టర్ లు, 3 ఆటోలు ఉన్నాయని వివరించారు. అదనంగా 6 ఆటోలు కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవెన్యూ ప్లాంటేషన్ కు గుంతలు త్రవ్విస్తామని, ట్రీ గార్డ్ లను సిద్ధంగా ఉంచుకొని మొక్కలు నాటింప చేసేందుకు చర్యలు తీసు కుంటామని మున్సిపల్ చైర్పర్సన్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మెన్ గుడిపూడి నవీన్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూర రవి నాయక్, మున్సిపల్ కమిషనర్ గణేష్, తహసీల్దార్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆకుపచ్చ తెలంగాణకు కృషి చేయాలి : జెడ్పీ చైర్మన్ జగదీష్
ములుగు : ఆకుపచ్చ తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ అన్నారు. బుధవారం 7వ విడుత హరితహారంలో భాగంగా ములుగు ఏరియా హాస్పిటల్, జాకారం పరిధిలో గట్టమ్మ దేవాలయం సమీపంలో జాతీయ రహదారిపై ఎంపీపీ గడ్రకోట శ్రీదేవి సుదీర్‌తో కలిసి ఆయన మొక్కలు నాటారు. హరితహారం లో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరూ విధిగా మొక్కలు నాటలన్నారు. తెలంగాణలో అటవీశాతం పెరిగిందని, ఇంకా పెంచేెందుకు ప్రయత్నం చేద్దాం అన్నారు. ములుగు, జాకారం సర్పంచ్‌లు బండారి నిర్మల హరినాదం, దాసరి రమేష్, తహసీల్ధార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ హన్మంతరావు, ఈఓ శంకర్, ఎంపీటీసీ గొర్రె సమ్మయ్య సీనియర్ నాయకులు గోవింద్ నాయక్, పట్టణ అధ్యక్షులు సంతోష్, కోప్షన్ మెంబెర్ యూనిస్, టీిఆర్‌ఎస్ నాయకులు రమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు భాగస్వాములవ్వాలి : డీఆర్ఓ రమాదేవి
పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని డీఆర్ఓ కుతాటి రమాదేవి పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం కాసిం దేవి పేట్ గ్రామ పంచాయతీ లోని పల్లె ప్రకృతి వనాన్ని ఆమె సందర్శించారు. ఈ కార్య క్రమంలో తహసీిల్దార్ సత్యనారాయణ స్వామి, సర్పంచ్ అహ్మద్ పాషా, పంచాయతీ కార్యదర్శి ,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనులను అధికారుల పరిశీలన
గోవిందరావుపేట : మండలంలో జరుగుతున్న పల్లె ప్రగతి పనులను ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ సురభితోbటు ఐటీడీఏ పీఓ హనుమంతు జెండగే బుధవారం పరిశీలించారు. పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని పరిశీలించారు. అనంతరం గాంధీ నగర్ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల హరిబాబు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి : పెద్దవంగర ఎంపీపీ
తొర్రూరు : పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారానే గ్రామాలు, హరిజన కాలనీలు, గిరిజన తండాలు అబివృద్ధి చెందుతాయని పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరిి అన్నారు. బుధవారం మండలంలోని కాన్వారు గూడెం, గంట్ల కుంట గ్రామాలలో పర్యటించారు. గ్రామ ప్రజలతో కలిసి సమస్యలు గుర్తించి వెంటనే పనులు చేయించాలని అధికారులకు సూచించారు. అనంతరం మొక్కలు నాటరు. నీరు నిలిచిన ప్రదేశాలను పైపులైన్ లీకేజీలను గుర్తించి వెంటనే బాగు చేయాలని సర్పంచ్, పంచాయితీ కార్యదర్శులకు సూచించారు. అనంతరం కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలను పరిశీలించారు. మిగిలి ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవో శేషాద్రి, ఎంపీఓ యాకయ్య, సర్పంచ్‌లు మద్దెల కరుణ ఆంజనేయులు, చింతల భాస్కర్, ఎంపీటీసీ ఈరెంటి అనురాధ శ్రీనివాస్,ఉప సర్పంచ్‌లు పాషా, చంద్రయ్య, మండల యూత్ అధ్యక్షులు కాసాని హరీష్,గ్రామ అధ్యక్షుడు కుమార్, నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి : వైస్ ఎంపీపీ తాతా గణేష్
బయ్యారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటి సంరక్షణ చేపట్టాలని మండల వైస్ ఎంపీపీ తాతా గణేష్ కోరారు. బుధవారం మండల పరిధిలోని బాలాజీ పేట గ్రామపంచాయతీ పరిధిలో నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. సర్పంచ్ వాంకుడోత్ జగన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు బత్తిని రామ్మూర్తి గౌడ్, ఉప సర్పంచ్ తంగళ్ళపల్లి వీరభద్ర, కార్యదర్శి రాజ్ కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి : ఆర్డీఓ రమేష్
తొర్రూరు : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో రమేష్ అన్నారు. బుధవారం మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబుతో కలిసి మూడవ వార్డులో పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. నీరు నిల్వ ఉన్న గుంటలలో ఆయిల్ బాల్స్ వేశారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా చిన్నపిల్లల నుంచి వద్ధుల వరకు డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా నీరు నిల్వ ఉన్న గుంతలలో ఆయిల్ బాల్స్ వేస్తున్నామన్నారు. అనంతరం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఒక్కరూ ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించి భవిష్యత్తు భావితరాలకు అందించాలని అన్నారు. వైస్ చైర్మెన్ జినుగా సురేందర్ రెడ్డి, మూడవ వార్డు కౌన్సిలర్ సంగీత రవి, శానిటరీ ఇన్స్పెక్టర్ కొమ్ము దేవేందరు, రామిని శ్రీనివాస్, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.