Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
ప్రభుత్వ శాఖలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అప్పటివరకు నిరుద్యోగ యవతకు భతి చెల్లించాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కల్వల రవీందర్ అధ్యక్షతన ఆ సంఘం మండల మహాసభ ఆదివారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా ప్రవీణ్ హాజరై మాట్లాడారు. స్వరాష్ట్రం సిద్ధిస్తే ఉద్యోగాలు లభిస్తాయని ఆశించిన యువతకు నిరాశే మిగిలిందని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ యువతను మోసగిస్తోందని తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా 1.80 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు లభించక యువత ఆత్మహత్యలకు పాల్పడుతుండడానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. అలాగే ఇటీవల తొలగించిన కాంట్రాక్ట్ నర్సులను, ఫీల్డ్ అసిస్టెంట్లను, మిషన్ భగీరథ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా శివరాత్రి నాగరాజు, కోకన్వీనర్‌గా కాకి వేణు, సభ్యులుగా అట్ల రాజ్‌కుమార్, గడ్డం అఖిల్, కల్వల మోక్షజ్ఞ, కొడపాక చంటి, కలువల శశికుమార్, కామిద్రి వంశీ పాల్గొన్నారు.