Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సాయంకాలం మండల కేంద్రంలోని పాకాల వాగు బ్రిడ్జిపై నుంచి వరద ఉధతి పెరిగింది. మండల కేంద్రం నుంచి నెక్కొండ, కేసముద్రం మండలాలకు రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షంతో మండలంలోని పలు గ్రామాల్లో కుంటలు, చెరువులు అలుగుపోశాయి. పాకాల వైబ్రిడ్జిపై వరద నీటి ఉదతిని తిలకించేందుకు ప్రజలు బారులు తీరారు. గూడూరు-నర్సంపేట మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని ఖానాపురం మండలంలోని బుధరావుపేట, మంగళవారిపేట మధ్య బ్రిడ్జి నిర్మించిన తాత్కాలిక కల్వర్టు వరద ఉధతికి కొట్టుకుపోవడంతో 365 నెంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం-వరంగల్ దారిలో వాహనాలను దారి మళ్లించారు. భారీ వర్షంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.
పరవళ్లు తొక్కుతున్న భీమునిపాదం జలపాతం
భీమునిపాదం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. మండలంలోని సీతానగరం గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీమునిపాదం జలపాతాన్ని తిలకించేందుకు సందర్శకులు అధిక సంఖ్యలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆదివారం చేరుకున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షంతో భీమునిపాదం జలపాతం వద్ద సందడి నెలకొంది.