Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెరువును తలపిస్తున్న చౌరస్తా
నవతెలంగాణ-మట్టెవాడ
నగరంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారుల్లో నీళ్లతో నిండి చెరువులను తలపిస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షానికి వరంగల్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో 4 అడుగుల మేర నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా వర్షపు నీరు పడిన వెంటనే సైడు కాలువల నుంచి ప్రధాన మురుగు నీటి కాలువల్లోకి వెళ్లే వెసులుబాటు ఉండేది.
అలాంటిది ప్రభుత్వ అధికారులు స్మార్ట్‌సిటీలో భాగమని ముందస్తు ప్రణాళికలు లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం పేరుతో రహదారికి ఇరువైపులా ఉన్న సైడు కాలువలు తొలగించారు. దీంతో సమీప కాలనీల్లోని వర్షపు నీరు బయటకు వెళ్లకుండా రహదారులను దిగ్బంధం అయ్యాయి. గతేడాది వచ్చిన వరదలను దష్టిలో పెట్టుకొని ఇకనైనా అధికారులు నగరం జలదిగ్బంధంలో అవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మత్తడి పోస్తున్న చెరువులు
నవతెలంగాణ-చెన్నారావు పేట
మండలంలో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు లింగాపురంలోని ముత్యాలమ్మ కుంట, తాళ్లకుంట, బ్రాహ్మణకుంట చెరువులు మత్తడి పోశాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింగాపురం సర్పంచ్ తప్పేట రమేష్, రైతులు, ముదిరాజ్ లతో కలిసి మత్తడి పోస్తున్న చెరువులను ఆదివారం పరిశీలించారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండి రైతులు ఆర్ధికంగా వద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులు మామిండ్ల సాంబయ్య, నిమ్మనబోయిన యాకయ్య, ముత్యాల మల్లయ్య, తిక్క స్వామి, తలేబోయిన సాంబయ్య, నరిగే కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన రహదారులపై నిలిచిన నీరు..
నవతెలంగాణ-కాజీపేట
కాజీపేట పరిసర ప్రాంతాలలో పలు కాలనీలు ప్రధాన రహదారులు ఆదివారం కురిసిన భారీ వర్షానికి జలమయంగా మారాయి. కాజీపేట పరిధిలోని దర్గా, బట్టూపల్లి కడిపికొండ, మడికొండ, ఎస్సీ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గహకల్ప, డీజిల్ కాలనీ కాజీపేట జూబ్లీ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. తార గార్డెన్ నుంచి సుబేదారి వరకు ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్న ప్రజాసమస్యలు తీరడం లేదని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లనే వర్షాలకు నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి 47వ డివిజన్లోని ప్రధాన రహదారి నీట మునగడంతో స్థానిక కార్పొరేటర్ సంకు నర్సింగ్ రావు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీజిల్ కాలనీ సమీపంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలువకుండా డ్రైనేజి ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆయన వెంట దువ్వ కనకరాజు, నయీం, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ఆదివారం ఉదయం కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శివనగర్, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, రంగశాయిపేట, కరీమాబాద్, ఉర్సు డీకే నగర్లో రోడ్లపై నీళ్లు ప్రవహించాయి. అండర్ డ్రెయినేజీ నిర్మాణం పూర్తికాకపోవడంతో శివనగర్‌లోని పల్లవి ఆస్పత్రి లైన్లో నీళ్లు నిలిచాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వానలు వచ్చినప్పుడూ సహాయక చర్యలు చేయడం మానుకుని శాశ్వత పరిష్కార మార్గాలను చూపాలని ప్రజలు కోరుతున్నారు.