Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వరంగల్/ ఖిలా వరంగల్
ఆరోగ్యంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే సైక్లింగ్ ద్వారానే సాధ్యపడుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. ఆదివారం ట్రైసిటీ రైడర్స్ ఆధ్వర్యంలో సైక్లింగ్ ర్యాలీని పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ప్రారంభించారు. హైద్రాబాద్ సైక్లింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 21 నుండి జూలై 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా సైక్లింగ్ పోటీల్లో భాగంగా వరంగల్‌లో ట్రైసిటీ రైడర్స్ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పోలీసు కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రైసిటీ రైడర్స్ బృందంతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ నుండి ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ కెయు క్రాస్, పెద్దమ్మగడ్డ, ములుగురోడ్డు, ఎంజిఎం జంక్షన్, పోచమ్మమైదాన్, వెంకట్రామా కూడలి మీదుగా ఖిలా వరంగల్ వరకు నిర్వహించిన ర్యాలీలో యువతి, యువకులు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ.. సైక్లింగ్ వల్ల శారీరకంగా ధృడంగా వుంటామన్నారు. నెలరోజులపాటు జరిగే ఈ పోటీల్లో వరంగల్ నగరం తరుపున ప్రాతినిధ్యం వహిస్తున్న కొందరు ఔత్సాహిక సైక్లిస్టులు ప్రతిరోజు 100 కిలోమీటర్ల వరకు సైక్లింగ్ చేస్తున్నారన్నారు. వారిని ప్రోత్సహించడానికి ఈ అవగాహన ర్యాలీలో ప్రత్యక్షంగా పాల్గొన్నానన్నారు. నగర యువత, ప్రజల్లో సైక్లింగ్‌ను ప్రోత్సహించడానికి ఇలాంటి అవగాహన ర్యాలీలు మున్ముందు మరిన్ని నిర్వహించాలని సూచించారు. అందుకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.
నగరంలోని సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా హన్మకొండ-కాజీపేట మార్గంలో ఎన్ఐటి వద్ద సైక్లింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారని, ఈ సదుపాయాన్ని విద్యార్థులతోపాటు నగరవాసులు ఉపయోగించుకోవాలన్నారు. హైద్రాబాద్ సైక్లింగ్ గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. రవీందర్ మాట్లాడుతూ హైద్రాబాద్ మహానగరంలో సుమారు 10 వేల మంది గ్రూపు సభ్యులు నిత్యం సైక్లింగ్ చేస్తున్నారన్నారు. వరంగల్ నగరంలో కూడా మహిళలు, యువతలో సైక్లింగ్ పట్ల ఆసక్తి పెంచాలని కోరారు.
ర్యాలీ సమన్వయకర్త స్రవంతిరెడ్డి మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల శరీరంలోని అత్యధిక కండరాలకు వ్యాయామం జరిగి శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉంటామని, మున్ముందు హృద్రోగ అనారోగ్య సమస్యలుండవని తెలిపారు. ఉదయం నుండి నిరంతరాయంగా కురుస్తున్న చిరుజల్లులని సైతం లెక్కచేయకుండా హైద్రాబాద్ సైక్లిస్ట్ గ్రూపు తరుపున 6గురు సభ్యుల ప్రతినిధి బృందం, ట్రైసిటీ రైడర్స్ సైక్లింగ్ క్లబ్ తరుపున సుమారు 50 మంది సైక్లిస్టులు పాల్గొన్నారన్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ తరుపున జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించిన హైద్రాబాది రైడర్ జయంత్ జునేజా, సమన్వయకర్తలు స్రవంతిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలను పోలీసు కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ ఇన్‌ఛార్జి డిసిపి పుష్ప, హన్మకొండ ఎసిపి జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.