Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
మహిళల్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ ఎంపీడీవో పల్లవిని మండల సమావేశం లో దుర్భాషలాడిన మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఏఐటీయూసీ కొమురయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పూటకో పార్టీ రోజుకో జెండా మార్చే తెలంగాణ ద్రోహి ఎర్రబెల్లి దయాకర్ రావు అని విమర్శించారు. టీఆర్ఎస్లో చేర్చుకున్న సీఎం కేసీఆర్ బాధ్యత వహించి ఎర్రబెల్లి వ్యాఖ్యలకు మంత్రివర్గం నుండి తొలగించాలన్నారు. తెలంగాణోద్యమంలో స్త్రీలంతా భాగస్వాములై ఇంటి నుండి రోడ్డెక్కితే వచ్చిన తెలంగాణను దయాకర్‌రావు లాంటి స్త్రీ వ్యతిరేక రాబంధులు పాలించడం సిగ్గుచేటన్నారు. మంత్రి బేషరతుగా తెలంగాణ స్త్రీ జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. మరోసారి ఎర్రబెల్లి ఇలాంటి దిగజారుడు అసభ్య కర వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని, వరంగల్ నడిబజారులో ఎర్రబెల్లి నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. ఎన్నికల నాడు స్త్రీ జాతి ముందుకు మంత్రి ఎలా వస్తాడో చూస్తామని, ఎర్రబెల్లి రాజకీయ జీవితం భూస్థాపితం ఖాయమన్నారు. ఈ సమావేశంలో ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు మోటపలుకుల సుజాత, సీపీఐ 28వ వార్డు కౌన్సిలర్ నూకల భూలక్ష్మి, మహిళా నాయకులు నవత, అనంత, అరుణ, కళావతి తదితరులు పాల్గొన్నారు .