Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ)
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్ర ప్రభుత్వం జీవో 60 ద్వారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తొలిసారి పీఆర్సీలో వేతనాలు పెంచిందని, కానీ, వైద్య ఆరోగ్య శాఖలో నేషనల్ హెల్త్ మిషన్(ఎన్హెచ్ఎం) పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచకపోవడం అన్యాయమని, వారికి పీఆర్సీ ప్రకారం వేతానాలు పెంచి రెగ్యులర్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా గౌరవ అధ్యక్షులు బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ... గత 15 నుంచి 22 ఏండ్లుగా పనిచేస్తూ చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో సాహసం చేస్తూ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఆలోచించి వేతనాల పెంపు చేసి రెగ్యులర్ చేయాలన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లోని 2వ ఎ ఎన్ ఎంలు, ఫార్మసిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, స్టాఫ్ నర్సులు, మెడికల్ ఆఫీసర్లు, ఆయుష్షు, ఆర్ బి ఎస్ కె, ఆరోగ్యశ్రీ వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రోగ్రాం అధికారులు, ఉద్యోగులందరూ మెరిట్ ప్రాతిపదికన 22 సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. వారి ఏజ్ లిమిట్ దాటిపొతోందని ఆవేదన వ్యక్తంచేశారు. భారత అత్యున్నత న్యాయస్థానం 2016 అక్టోబర్ 31న శాశ్వత స్వభావం కలిగిన పోస్టుల్లో శాశ్వత సిబ్బందిని నియమించాలని , సమాన విద్యార్హతలతొ పనిచేస్తున్న సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిందన్నారు. అయినా పట్టించుకోని దుస్థితి నెలకొందన్నారు. ప్రస్తుత పీఆర్సీల్లో ఆయా క్యాడర్ల కనీస వేతనాన్ని బట్టి వేతనాలు పెంచాలన్నారు. డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు ఇవ్వాలన్నారు. కరోనా కాలంలో పనిచేసి తొలగించిన 1640మంది స్టాఫ్నర్స్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వేతనంతో కూడిన 180 రోజుల ప్రసుతి సెలవు ఇవ్వాలని, ప్రమాద బీమా, ఉచితంగా ఆరోగ్య చికిత్స సౌకర్యం కల్పించాలన్నారు. యూనిఫాం అలవెన్సులతోపాటు ఇతర అలవెన్సులు ఇవ్వాలన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులు విధి నిర్వహణలో చనిపోతే రూ.25లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు బి దీనా, నాయకులు కష్ణవేణి, సదాలక్ష్మి, మహేశ్వరి, గీత, యాద లక్ష్మి, రజిత, పార్వతి, రమాదేవి, సుమలత, పద్మ, మహేశ్వరి, ఆగమ్మ, సుమన్, రామ్కి, తదితరులు పాల్గొన్నారు.