Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు
- గ్రామపంచాయతీ ఆదాయానికి గండి
- చితికిపోతున్న కూరగాయల చిరు వ్యాపారులు
నవతెలంగాణ-పాలకుర్తి
గ్రామపంచాయతీ నిబంధనలకు విరుద్ధంగా తై బజార్ కాంట్రాక్టర్ కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల వద్ద ఇష్టారీతిని వసూళ్లకు పాల్పడుతున్నాడు. దీంతో కూరగాయల చిరువ్యాపారులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వివరాల్లోకెళ్తే... ప్రతి సోమవారం పాలకుర్తిలో అంగడి (సంత) సాగుతుంది. కూరగాయలు అమ్ముకునేందుకు చిరు వ్యాపారులతోపాటు టాటా ఏసీలో కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు వస్తారు. కూరగాయలు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ఇంటి ముందున్న యజమానులకు నెలసరి మామూళ్లు ఇస్తుంటారు. అయితే ఒక్కో కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారి వద్ద తై బజారు కాంట్రాక్టర్ రూ.30 వసూలు చేసి రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, రూ.50 వసూలు చేసి ఎలాంటి రసీదు ఇవ్వట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొట్టడంతోపాటు కూరగాయల చిరు వ్యాపారులను నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి. రూ.50 ఇస్తేనే సరి లేదంటే కాంటా బాట్లు ఎత్తుకెళ్తున్నారని కూరగాయల చిరు వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంగడి లో ఇంత దోపిడీ జరుగుతున్నప్పటికీ గ్రామపంచాయతీ పట్టించుకోవడంలేదనే విమర్శలొస్తున్నాయి. వసూళ్ళ పట్టికను బోర్డు రూపంలో అంగడి లో ఏర్పాటు చేయాల్సి ఉండగా అలాంటి చర్యలు చేపట్టట్లేదు.న దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తై బజారు తో పాటు పశువులు, గేదెలు, మేకలు, గొర్రెల రహదారి వసూళ్ల పట్టికను ప్రతి చిరు వ్యాపారికి అందజేయాలని, రసీదు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చిరు వ్యాపారస్తులు కోరుతున్నారు.