Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
- కాజీపేట చౌరస్తా నుంచి హన్మకొండ వరకు సైకిల్, ఎడ్లబండ్లతో ర్యాలీ
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా/కాజీపేట
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా సోమవారం డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాజిపేట చౌరస్తా నుంచి హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు ఎడ్ల బండ్లు, సైకిల్లతో భారీ ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, వంట నూనెల ధరలు పెంచుకుంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. గత నెల రోజుల్లో ప్రభుత్వం 18 సార్లు పెట్రోలు, డీజిల్, ధరలు పెంచడం అమానుషమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను కాపాడాల్సింది పోయి, వారిపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు వరాలు కురిపించేందుకు ప్రజలపై భారాలు మోపుతోందని మండిపడ్డారు. మోడీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినా కూడా మన దగ్గర ధరలు తగ్గవా అని ఆయన ప్రశ్నించారు. గత 13 నెలలుగా వరసగా పెట్రోల్, డిజిల్ ధరలను పెంచుతూ మూలిగే నక్కపైన తాటిపండు పడ్డ చందంగా బీజేపీ ప్రభుత్వం వ్యాపార దక్పదంతో వ్యవహరించడం వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించి పేద మధ్య తరగతి ప్రజలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఉత్తర జిల్లాల కో -ఆర్డి నేటర్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డి నేటర్ నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, ఈ.వి. శ్రీనివాస్ రావు, దొమ్మాటి సాంబయ్య, పిసిసి కార్యదర్శులు మీసాల ప్రకాష్, కుందూరు వెంకట్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశానుసారం సోమవారం పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించాలని మడికొండ చౌరస్తా నుంచి ఫాతిమా నగర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల.రవీందర్, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు, కార్పొరేటర్లు బైరి.వరలక్ష్మి లింగమూర్తి, సందేలబి విజరు, బైరి కొమురయ్య, పీఏసీఎస్ డైరెక్టర్లు మెరుగు.రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
గిర్నిబావి నుంచి నర్సంపేట వరకు సైకిల్ ర్యాలీ
నవతెలంగాణ-నర్సంపేట
పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్, నిత్యవసర ధరలను పెంచేసి సామాన్యుడిపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు భారం మోపుతూ నడ్డివిరుస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డి అన్నారు. సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోలియం ధరలను వ్యతిరేకిస్తూ దుగ్గొండి మండలం గిర్నిబావి నుంచి నర్సంపేట-వరంగల్ ప్రధాన రహదారి వెంట భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఏఐసీసీ సభ్యులు దొంతి మాధవరెడ్డితో పాటు ముఖ్యశ్రేణీ కార్యకర్తలు సైకిల్ ర్యాలీలో పాల్గొని నర్సంపేటకు చేరుకున్నారు. అనంతరం ఆర్అండ్బీ గెస్టు హౌజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దొంతి మాట్లాడారు. కేంద్రంలోని యేడేండ్ల బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కూడపలుక్కొని పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు మోపుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలతో నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడు బ్రతకడం ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు దొందు దొందేనని, సీఎం కేసీఆర్, బీజేపీ నేతలు ఢిల్లీలో దోస్త్ చేస్తూ గల్లీలో లఢాయి అంటూ తెలంగాణ ప్రజలను మోసగిస్తున్నాడని దుయ్యపట్టారు. ఈ రెండు ప్రభుత్వాల ధ్వంద నీతిని ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు రాబోతున్నాయని, కాంగ్రేస్ ప్రతి కార్యకర్త ప్రభుత్వాల నిజ స్వరూపాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బుద్ధి చెప్పాలని సూచించారు. ఇప్పటికైన ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు ఇంటికి సాగనంపకతప్పరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్ రావు, టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి, నర్సంపేట పట్టణ కాంగ్రేస్ అధ్యక్షులు పెండెం రామానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల సాంబయ్య గౌడ్, కాంగ్రేస్ దుగ్గొండి, నర్సంపేట, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ మండలాల అధ్యక్షులు ఎర్రళ్ల బాబు, భానోతు లక్ష్మణ్ నాయక్, చిట్యాల తిరుపతిరెడ్డి, బక్కి అశోక్, భూక్య గోపాల్ నాయక్, వేముపెల్లి వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-శాయంపేట
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెంపుతో సామాన్య ప్రజానీకంపై అదనపు భారం పడుతోందని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు మామిడిపల్లి సాంబయ్య అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశానుసారం ధరల పెంపునకు నిరసనగా సోమవారం స్థానిక బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వెంటనే ప్రభుత్వం ధరలను నియంత్రించి నిరుపేదలను ఆదుకోవాలని ఈ సందర్బంగా వారు డిమాండ్ చేశారు. మహిళా ఎంపీడీవో పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామెరకొండ కొమురయ్య, చింతల రవిపాల్, భాస్కర్, కటయ్య, రమేష్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-చెన్నారావు పేట
ఏఐసీసీ, టీపీసీసీ పిలుపుమేరకు పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిరసిస్తూ గిర్నిబావి నుంచి నర్సంపేట వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భూక్య గోపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి మంద యాకయ్య గౌడ,్ పోలేపెళ్లి భిక్షపతి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఆత్మకూరు
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశానుసారం ధరల పెంపును నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రం నుంచి గూడెప్పాడ్ సెంటర్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు భగవాన్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వీర వెంకట రమణ, బీసీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, గుండెబోయిన శ్యాం, దయ్యాల రమేష్, పెరుమాండ్ల ప్రభాకర్, కరుణాకర్ పాల్గొన్నారు.