Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
కాకతీయ విశ్వవిద్యాలయ ఒప్పంద అధ్యాపకులను రెగ్యూలరైజ్ చేయాలని విశ్రాంత ఆచార్యులు కే మురళి మనోహర్ అన్నారు. సోమవారం జాఫర్ నిజాం సెమినార్ హాల్లో 'ఉన్నత విద్యా రంగంలో విశ్వవిద్యాలయాల ఒప్పంద అధ్యాపకుల పాత్ర- క్రమబద్ధీకరణ' అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్వవిద్యాలయాలలో టీచర్ రిక్రూట్మెంట్ జరగకపోవడంతో గత కొన్నేండ్ల నుంచి కాంట్రాక్టు వ్యవస్థ కొనసాగుతోందన్నారు. బోధనలో సుదీర్ఘ అనుభవం ఉండి చాలా సంవత్సరాల నుండి విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకుల అందరిని రెగ్యులరైజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియలో కలిగిన అడ్డంకులను ప్రభుత్వమే స్వయంగా పరిశీలించాలని, అందరిని విశ్వవిద్యాలయాల్లో పర్మినెంట్ చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని వర్సిటీ ఉపకులపతులను ఆయన కోరారు. అదేవిధంగా వర్సిటీలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల అందరికీ సమాన పనికి, సమాన వేతనం అందజేయాలన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను యూజీసీ నిబంధనల ప్రకారం రెగ్యులర్ కోర్సులుగా మార్చి, బ్లాక్ గ్రాండ్ పెంచి వర్సిటీల మనుగడ కాపాడాలని సూచించారు. యూనివర్సిటీ అభివద్ధిలో ఒప్పంద అధ్యాపకుల సేవలను అకాడమితితో పాటు, అడ్మినిస్ట్రేషన్ విభాగాలలో కూడా ఉపయోగించుకున్నట్లయితే సీనియర్ ఆచార్యులు పరిశోధనకు ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ శ్రీధర్ కుమార్ లోద్, సీనియర్ అధ్యాపకులు డాక్టర్ ఆశీర్వాదం, డాక్టర్ గడ్డం కష్ణ, డాక్టర్ టీ నాగయ్య, డాక్టర్ రంగారెడ్డి కేయూసీటీఏ ప్రధాన కార్యదర్శి ఆర్డి ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ చందూలాల్, కోశాధికారి డాక్టర్ సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.