Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లా పశు వైద్యశాల పేరుకే ఉందని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొమ్మనబోయిన శ్రీనివాస్ అన్నారు. జిల్లా పశువైద్యశాలలో సరైన వసతులు లేవని, వైద్యం అందడం లేదని, పూర్తిస్థాయిలో మందులు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ పశువైద్యశాల సర్వే నిర్వహించారు. 43 గ్రామపంచాయతీలకు ఒకే పశువైద్యశాల ఉందన్నారు. వైద్యుడు లేడని, ఇన్ఛార్జి వైద్యుడు ఇద్దరు సిబ్బందితో ఆస్పత్రి నడుస్తోందని తెలిపారు. కాంపౌండర్ పోస్ట్ కొన్ని నెలలుగా ఖాళీగా ఉందన్నారు. మండలంలో కొత్త పశువైద్యశాల ఏర్పాటు చేసి భవనం నిర్మించాలని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి గండ్రకోటి కుమార్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నేతుల రాకేష్, మండల కార్యదర్శి చెన్నబోయిన అశోక్, ఎడ్ల శ్రీనివాస్, సోమనబోయిన లింగయ్య, అమడగని రఘు, నల్లబోతుల వీరన్న, బెల్లి వెంకన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.
పర్మినెంట్ డాక్టర్ లేక..
నెల్లికుదురు : పశువుల ఆస్పత్రిలో పర్మినెంట్ డాక్టర్ లేకపోవడం వల్ల వైద్యం అస్తవ్యస్తంగా ఉందని జీఎంపీఎస్ జిల్లా నాయకుడు నక్క హరీష్ యాదవ్ తెలిపారు. మండలంలోని మేచరాజుపల్లి గ్రామంలోని పశువుల వైద్యశాలను సందర్శించి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. సీజనల్ జబ్బులు వస్తున్న సమయంలో పర్మినెంట్ వైద్యులు, సరైన సిబ్బంది లేకపోవడంతో గొర్రెలు, మేకలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు జక్కుల యాకాంతం, ధగ్గడ్ వరుణ్, శోభనబోయిన హరీష్, చిన్నాల గణేష్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు.
బయ్యారం : మండల కేంద్రంలోని పశువుల ఆస్పత్రిలో వసతులు కరువయ్యాయని జీఎంపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దూదిమెట్ల మోహన్రావు అన్నారు. గ్రామంలోని పశు వైద్యశాలలో ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్రావు మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో అరకొర వసతులతో ప్రభుత్వ పశు వైద్యశాల నడుస్తోందని తెలిపారు. ఇప్పటివరకు గొర్రెలు, మేకలకు వ్యాక్సిన్లు వేయలేదన్నారు. మందులు కూడా లేవని చెప్పారు. కార్యక్రమంలో గందంపల్లి సొసైటీ అధ్యక్షుడు కుమారస్వామి, నీలారపు సంపత్, కొమరయ్య, తదితరులు పాల్గొన్నారు.