Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని నీరుగార్చేలా కుట్ర చేస్తోందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో పార్టీ మూడో గ్రామ మహాసభ సోమవారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా వెంకట్రెడ్డి హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రైతులకు, కార్మికులకు ఒరిగిందేమీ లేదన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అన్ని తరగతుల ప్రజల వ్యతిరేకిగా మారిందని, ఎన్నికల హామీలను విస్మరించి మోసపూరిత పాలన సాగిస్తోందని మండిపడ్డారు. మహాసభలో గత కార్యక్రమాలను సమీక్షించారు. అనంతరం కమిటీని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా కాప కోటేశ్వరరావు, సభ్యులుగా గుండు లెనిన్, సోలిపురం రాజిరెడ్డి, మరికంటి నర్సయ్య, కట్టా వెంకటేశ్వర్రావు, గుండు రామస్వామి, నిమ్మల భిక్షం ఎన్నికయ్యారు. మహాసభలో పార్టీ మండల కార్యదర్శి పులిగుజ్జు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.