Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిన్నంటిన కుటుంబ సభ్యుల రోధనలు
నవతెలంగాణ-నర్సంపేట
ఈ నెల 11న పెద్దం చెరువు వాగులో కొట్టుకపోయి గల్లంతైన గడ్డం అనిల్(42) మృతదేహం సోమవారం లభ్యమైంది. గురిజాల గ్రామానికి చెందిన అనిల్ తన ద్విచక్రవాహనంతో వాగు దాటుతుండగా కాలుజారీ వాగు ఉధృతిలో కొట్టుకపోయిన ప్రమాద సంఘటన పలువురిని చలింపజేసింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సంఘటనపై దిగ్భ్రాంధి చెంది గాలింపు చర్యలకై అధికారులను ఆదేశించారు. సర్పంచ్ గొడిశాల మమత సదానందం గల్లంతైన అనిల్ ఆచూకి కోసం పలువురి గజ ఈతగాళ్లను, గ్రామస్తులను వెతకడానికి ప్రత్యేక చోరువ కనపర్చారు.
రెండ్రోజుల పాటు తహసిల్దార్ రాంమూర్తి, చెన్నారావుపేట ఎస్ఐ రవి నేతృత్వంలో గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఆర్డీఓ పీ.పవన్ కుమార్ సోమవారం వాగు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ గాలింపు చర్యల్లో వాగు ప్రవాహానికి కొట్టుకపోయిన అనిల్ మృతదేహాం సోమవారం అర కిలో మీటర్ దూరంలోని మాటు సమీపంలోని ముళ్లపొదళ్లలో లభ్యమైంది. అనిల్ గాలింపు చర్యలను కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ఎదురు చూపు ఉత్కంఠ, ఉధ్వేగభరితంగా సాగింది. వీరి రోధనలు మిన్నంటుకున్నాయి. మృతుడు అనిల్‌కు భార్య ఉమా, తల్లి ఉన్నారు. ఈ సంఘటనపై సర్పంచ్ గొడిశాల మమత సదానందం, పలువురు టీఆర్ఎస్ నాయకులు దిగ్భ్రాంధి వ్యక్తం చేస్తూ అనిల్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటామని తెలిపారు.
ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: రేవూరి
వాగులో గల్లంతై మృత్యువాత పడిన గడ్డం అనిల్ కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు రేవూరి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. గురిజాల రోడ్డులోని లోలెవల్ కాజ్‌వేను ఆయన సోమవారం సందర్శించారు. దెబ్బతిన్న కాజ్‌వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ.. పెద్ద చెరువు లోలెవల్ కాజ్వే వద్ద బ్రిడ్జి నిర్మాణం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనపర్చినందునే ఈ ప్రమాదం సంఘటనలు చోటుచేసు కొంటున్నాయని, ఇందుకు ప్రభుత్వం బాధ్యతవహించి మృతుడు అనిల్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి ప్రమాదాలను నివారించాలన్నారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కొత్త శ్రీనివాస్, దూపటి ఆనంద్, చల్లా రామచంద్రరెడ్డి, గోలి యుగేందర్, ముత్తినేని వెంకన్న పాల్గొన్నారు.