Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ-భూపాలపల్లి
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరద తాకిడి గురయ్యే ఏరియాలను గుర్తించి, ప్రజలకు ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుంచి జేసీ కూరాకుల స్వర్ణలత, అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్‌లతో కలిసి అధికా వర్షాల్లో ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వానలతో జలాశయాలు నిండి లోతట్టు ప్రాంతాల్ల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉన్నందున ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తుగా ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. మండలాలకు ప్రత్యేక అధికారుల నియామకం చేపట్టి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం, రిహాబిలిటేషన్ సెంటర్లలో సౌకర్యాలు కల్పించడం, లోతట్టు ప్రాంత ప్రజలను అవుసరమైతే రవాణా సౌకర్యం కల్పించి పునరావాస కేంద్రాలకు తరలించడం సంబంధిత విషయాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అప్రోచ్ రోడ్లు, లోలైన్ కాజ్వే అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలని, ఏమైనా రిపేర్లు ఉంటే వెంటనే మరమ్మత్తు చేసుకోవాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్అండ్బీ శాఖ ద్వారా రోడ్లు, కల్వర్టులు మరమ్మతులకు గురై ప్రాబ్లంగా ఉంటే వెంటనే గ్రావెల్‌తో ఫిల్ చేసి సరి చేసుకోవాలన్నారు. అధికారులు ప్లడ్ ఎక్విప్మెంట్ కావలసిన పక్షంలో ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. ప్రతీ తహశీల్దార్ తన దగ్గర మైక్స్, లైఫ్ జాకెట్, రోప్స్, టార్చ్ లైట్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. పలిమెల మండలంలో వరద ప్రభావిత ప్రాంతం ఎక్కువగా ఉంటుందని, సంబంధిత ప్రత్యేక అధికారి ఆ మండలంపై ప్రత్యేక చొరవ చూపి ప్రజలను రక్షించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పర్యవేక్షణలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టి ఒక ప్రణాళిక ప్రకారం మొక్కలు నాటి సుందరంగా తీర్చిదిద్దారని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శోభారాణి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, ముఖ్య ప్రణాళిక అధికారి సామ్యూల్, డీఆర్డిఓ పురుషోత్తం, కలెక్టరేట్ పరిపాలనాధికారి మహేష్ బాబు, ఆర్ అండ్ బి ఇంజనీరింగ్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.