Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోపణలు వీడి అభివృద్ధిలో భాగస్వాములవ్వాలి : గ్రామస్తులు
నవతెలంగాణ-గార్ల
ఏకగ్రీవంగా చేసుకున్న గ్రామ పంచాయతీల్ని అభివద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.20లక్షల ప్రోత్సాహక బహుమతి అందిస్తుందని సీఎం కేసిఆర్ స్థానిక సంస్దల ఎన్నికలకు ముందు ప్రకటించారు. దీంతో మండల పరిధిలో నూతనంగా ఏర్పడిన పినిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీని గ్రామంలోని అఖిలపక్ష పార్టీలు ఏకగ్రీవంగా పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. అధికార పార్టీ కి సర్పంచ్ ను, ఉమ్మడి పంచాయతీలో సర్పంచ్, ఎంపీటీసీగా గెలిచి పని చేసిన సీపీఐ(ఎం) ఉపసర్పంచ్‌తో సహా 3, కాంగ్రెస్ 3, టీడీపీకి ఒకటి, న్యూడెమోక్రసి పార్టీ నుండి ఒకరిని వార్డు సభ్యులుగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామ అభివద్ధి కి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా పంచాయతీ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మూడేండ్లలో పంచాయతీ పాలకవర్గంలో విభేదాలు నిత్యం కొనసాడుతూనే ఉన్నాయి పాలక వర్గం ఏర్పాటు చేసిన ప్రతి సమావేశంలో అభివద్ధి విషయంలో అధికార పార్టీ సర్పంచ్ కు, సీపీఐ(ఎం) మినహా ఇతర పాలక వర్గ సభ్యులకు నిరంతరం వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని సార్లు సమావేశాలు సైతం వాయిదా పడిన ఘటనలు అనేకమున్నాయి. ఇది ఇలా ఉండగా పంచాయతీ అభివద్ధికి సహయ సహకారాలు అందిస్తామని ప్రచారం, ఖర్చు లు లేకుండానే వార్డు సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొందరు వ్యవహరిస్తున్న తీరు రాజకీయ విలువలు దిగజార్చేల ఉన్నాయని గ్రామస్థులు బహిరంగంగా చర్చించు కుంటున్నారు. సర్పంచ్ ఉన్నప్పటికి టీఆర్ఎస్ వార్డు సభ్యులు లేరనే అవకాశాన్ని అదునుగా తీసుకుని ఏకగ్రివంగా ఎన్నికైన విషయం విస్మరిస్తున్నారు. కొందరు వార్డు సభ్యులు సర్పంచ్‌ను ఏదో ఒక సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం. నూతనంగా ఏర్పడిన పంచాయతీ ని అన్ని రంగాలలో అభివద్ధి చేసుకోవడానికి అధికార పార్టీ కి చెందిన సర్పంచ్‌కు తోడ్పాటందిస్తున్న సీపీఐ(ఎం) ఉప సర్పంచ్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. పంచాయతీ ఏర్పడిన మొదటి సంవత్సరంలో పంచాయతీ కార్యదర్శి పై పంచాయతీ నిధుల విషయంలోను, తరువాత సర్పంచ్ అభివద్ధి పనులు చేయడం లేదని పాలక వర్గ సమావేశాలలో కొందరు వార్డు సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం వారు సీపీఐ(ఎం) సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రయత్నం చేసినట్టు తెలిసింది. పంచాయతీ నిధులను సక్రమంగా వినియోగించడంలోను, అభివద్ధి పనుల విషయంలో పంచాయతీ పాలక వర్గానికి దిక్సూచిగా ఉండే ఉప సర్పంచ్ పై ఇలాంటి ప్రయత్నాలు చేయడం పట్ల రాజకీయ పార్టీలు, సీనియర్ రాజకీయ నాయకులు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాడు ఏకగ్రీవమైన వార్డు సభ్యులు, ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అంటూ అభివద్ధి చేయడం లేదంటూ సమావేశాలకు ఆటంక పరచడం గమనార్హం. అభివద్ది చేసే విషయంలో తేడాలు వస్తే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించుకుని ముందుకు పోవాలని గ్రామస్థులు సూచిస్తున్నారు. పంచాయతీని అభివద్ధి చేయాలని లక్ష్యంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు అభివద్ధి చేసే విషయంలో రాజీ పడకుండా పాలక వర్గ సమావేశాలలో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించుకుని నూతన పంచాయతీ ని ఆదర్శ పంచాయతీ చేయడానికి భాగస్వాములు కావాలని గ్రామస్తులు కోరుతున్నారు.