Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
రాష్ట్రంలో ఖాళీ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకట్రాజం డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కాసాని పుల్లయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో లక్షా84 వేల పోస్టులు ఖాళీగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 10,143 పోస్టులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. దీంతో నిరుద్యోగులు నష్టపోతున్నారని, ఈ క్యాలెండర్ వల్ల నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు. రాష్ట్రంలో 40లక్షలమంది దాకా నిరుద్యోగులు ఉన్నారన్నారు. నిరుద్యోగులు సొంతూళ్లను వదిలి పట్టణ ప్రాంతాలలో అద్దె రూముల్లో వేలకు వేలు డబ్బులు కడుతూ కోచింగ్లు తీసుకుంటూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. వారిని మోసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, 6500 పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, గ్రూప్ 1,2,3,4 లలో 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. సచివాలయంలో 8 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, లైబ్రరీలో 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పోస్టులన్నింటిని భర్తీ చేయకుండా కేవలం 10,143 పోస్టర్లు జాబితాలను వదలడం దారుణమన్నారు. వెంటనే మొత్తం ఖాళీ పోస్టులు భర్తీ చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పొదల నాగరాజు, మండల కమిటీ సభ్యులు గోల్కొండ చక్రపాణి, మైలారం వెంకటేశ్వర్లు, కడారి ఐలయ్య, గంగాపురం మహేందర్, బంద్ రవీందర్, చెరకు కష్ణమూర్తి, కల్లెడ సిద్ధులు, సులిగల రవి, పొదల దేవేందర్, లవకుమార్, తదితరులు పాల్గొన్నారు.